చెన్నై తరహాలో అమరావతికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: చెన్నై వరద బీభత్సం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాసిన ఈ లేఖను శనివారం మీడియాకు విడుదల చేశారు. కేవీపీ వేసిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవీ..
► 9వ తేదీన అనుమతులు వస్తే పదో తేదీన జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఆ సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టారు. ఎన్జీటీ ఆదేశించిన తరువాతే ఎందుకు ప్రచురించారు? రహస్యంగా ఎందుకు ఉంచారు? కేంద్ర పర్యావరణ శాఖ సియా అనుమతులు ఇచ్చేసిందని ఎలా ప్రకటిస్తుంది?
► పర్యావరణ ప్రభావానికి లోనయ్యే ప్రాజెక్టుకు సియా అనుమతి ఎలా ఇస్తుంది?
► ప్రభుత్వ కార్యాలయాలకు, పార్కులకు, వాణి జ్య కేంద్రాలకు, నివాస సముదాయాలకు, పరిశ్రమలకు షరతులతో కూడిన అనుమతి ఉందని పర్యావరణ అనుమతి పత్రంలో ఉంది. పరిశ్రమల వివరాలేవీ లేకుండా పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారు?
► కొండవీటివాగు వల్ల 15 వేల ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని ఏపీసీఆర్‌డీఏ అధికారికంగా తెలిపింది. ఇదంతా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. చె న్నై, శ్రీనగర్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో వరదలు సంభవించిన పరిస్థితుల్లో వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించడం సమంజసమేనా?
► 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మిస్తున్నామని, ఇందులో 127 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సారవంతమైన భూములు ఉన్నాయని, అలాగే 30 నుంచి 40 శాతం వరకు ఈ ప్రాంతం కృష్ణా నదీ ప్రాంతంలో ఉందని సీఆర్డీయేనే స్వయంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నదితో పాటు సహజ వనరులు దెబ్బతినవా?
► నదీ పరీవాహక ప్రాంతమంతా కాంక్రీటు వనమైతే చెన్నై తరహాలో వరద ముప్పు సంభవించదా?