అటవీ భూములు డీనోటిఫై
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్
అనంతపురం సెంట్రల్/ న్యూటౌన్: కొత్తగా ఏర్పడే రాష్ట్రాల రాజధాని నిర్మాణానికి అటవీభూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. సోమవారం ఆయన అనంతపురంలోని డీఆర్‌డీఏ అభ్యుదయ హాల్‌లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విదేశీబ్యాంకుల్లో ఉన్న నల్లధనం ఇప్పటి వరకూ రూ.5 వేల కోట్లు వెలికితీశామని తెలిపారు.
వెంకయ్యను అడగండి..: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా! ఇక ఆ విషయం గురించి మాట్లాడవద్దు’ అని జవదేకర్ అన్నారు. హోదా విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. చట్టంలో లేనిదానిపై మాట్లాడవద్దని సూచించారు. ప్రత్యేకహోదా, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును అడగాలని సూచించారు. పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని ప్రస్తావించగా.. అదీ వెంకయ్యనే అడగాలన్నారు.
రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం
అంతకుముందు అనంతపురంలోని లలితకళాపరిషత్తులో జరిగిన ‘వికాస్‌పర్వ్’ విజయోత్సవ సభలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
ఉచిత విద్యుత్ కేంద్రం చలవే: హరిబాబు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి 24 గంటలూ కరెంటు ఉందంటే కేంద్రం అందిస్తున్న సహకారమే కారణమని తెలిపారు.