ఐటీ దెబ్బ-ఉల్లి అబ్బా..!
సాక్షి, నాసిక్ : ఇన్‌కమ్ టాక్స్ అంటే నల్లకుబేరులు, అక్రమార్కులేకాదు.. ఉల్లి వ్యాపారుల కూడా భయం పట్టుకుంది. ఐటీ దాడులు జరుగుతున్నాయనే సరికి.. ఉల్లి వ్యాపారులు ధరలను అమాంతం నేలకు దించేశారు. ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఉల్లిని అమ్మడం మొదలు పెట్టారు.. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా?? ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకేం చదవండి.
మహరాష్ట్రలోని అతి పెద్ద ఉల్లి హోల్‌సేల్ వ్యాపారాన్ని నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇక్కడున్న లాసల్గాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఉల్లిని టోకుగా చిరువ్యాపారులుకు అమ్ముతుంది. ఈ మార్కెట్ కమిటీపై ఎవరూ ఊహించని విధంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏపీఎంసీ కార్యాలయాలు, గోడౌన్లు, నాసిక్‌లోని అతిపెద్ద ఉల్లి వ్యాపారస్తులైన ఏడుమంది ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో నాసిక్‌లో ఒక్కసారిగా ఉల్లిధరలు 35 శాతం తగ్గిపోయాయి.
ఐటీ దాడులు జరపడానికి మునుపు క్వింటాల్ ఉల్లి రూ.1400 ధర పలికేది. దాడులు తరువాత క్వింటాల్ రూ.900కు దిగింది. ఈ విషయంపై ఏపీఎంసీ ఛైర్మన్ జయదత్తా హోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల వల్ల టోకు ధరలు పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్‌కు వచ్చే ఉల్లిని రోజువారీ ధరల ప్రకారమే అమ్మడం.. కొనడం చేస్తున్నామని చెప్పారు. ఐటీ దాడుల అనంతరం రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పారు.
ఐటీ దాడుల వల్ల ఒక్కసారిగా ఉల్లిపాయల ధర నేలకు దిగిరావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండుమూడు నెలలుగా ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని.. వీటిని ఇలా అయినా నిరోధించడం మంచి పరిణామం అని కొనుగోలుదారులు అంటున్నారు.