I-T raids
-
రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన
బీజింగ్/న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్‌తో పాటు హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్న చైనా దేశీయుడు లూ సాంగ్‌ను ఆదాయ పన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై డ్రాగన్ స్పందించింది. విదేశాల్లో వ్యాపారం నిర్వహించే చైనీయులు స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. అయితే అదే సమయంలో చైనా కంపెనీల సాధారణ కార్యకలాపాల విషయంలో భారత్ పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్షకు తావు లేని మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా చైనా కంపెనీల హవాలా దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఐటీ శాఖ మంగళవారం ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రాం సహా మరో 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో వెయ్యి కోట్ల రూపాయాల మేర హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించారు. చైనాకు చెందిన ఓ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు భారత్‌లో రీటైల్ షోరూంల బిజినెస్ పేరిట షెల్ కంపెనీలు సృష్టించి వందలాది కోట్లు వసూలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) తెలిపింది. ఈ డబ్బును హాంకాంగ్, అమెరికా కరెన్సీలోకి మార్చేందుకు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మనీల్యాండరింగ్‌కు ప్రధాన సూత్రధారి అయిన లూ సాంగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించనుంది.(హవాలా లావాదేవీల్లో ఆరితేరిన లూ సాంగ్) ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ఓ భారత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ కంపెనీలు మనీల్యాండరింగ్ చేశాయా అన్న విషయం గురించి పూర్తిగా తెలియదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనా ప్రభుత్వం స్పష్టం గా చెబుతోంది. అయితే అదే సమయంలో మాకు మా పౌరులు, వారి కంపెనీల రక్షణ కూడా ముఖ్యమే. చైనా కంపెనీల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా న్యాయపరమైన, వివక్ష రహిత వాతావరణాన్ని భారత్ కల్పిస్తుందని చైనా ఆశిస్తోంది’’అని పేర్కొన్నారు. కాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించడం సహా పలు చైనా యాప్‌లను భారత్ నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. భారత యువతిని పెళ్లాడి.. హవాలా రాకెట్‌కు సూత్రధారి అయిన లూ సాంగ్.. భారత పాస్‌పోర్ట్‌ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్‌కు భారత్‌లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్‌కు పాల్పడే క్రిమినల్ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 40కి పైగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న లూ సాంగ్.. దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా వెల్లడైంది. -
టాలీవుడ్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆదాయపన్నుశాఖ (ఐటీ) దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాగ్యనగరంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, వారి సంస్థలకు సంబంధించిన కార్యాలయాల్లో 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. బుధవారం ఉదయం 6 గంటలకే రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు మూడేళ్లుగా ఐటీ పన్ను బకాయిలు, బ్యాలెన్స్ షీట్ల రికార్డుల్లో అవకతవకలు దొర్లాయని.. సినిమా నిర్మాణ వ్యయాలు, వార్షిక ఆదాయాల లెక్కల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఏడు సంస్థలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రామానాయుడు స్టూడియోలోని ఆడిటింగ్ కార్యాలయం, జూబ్లీహిల్స్‌లోని సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం, సురేష్ బాబు ఇల్లు, గెస్ట్ హౌస్‌లలోనూ సోదాలు జరిగాయి. దాదాపు 50 మందికి పైగా అధికారులు సోదాలు నిర్వహించారని సమాచారం. దాడులు జరిగిన అనుబంధ కంపెనీలివే.. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దగ్గుపాటి ఫార్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజేశ్వరి ఫార్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, సురేష్ యాడ్స్ కంపెనీలపై దాడులు నిర్వహించారు. అన్ని కార్యాలయాల ఐటీ రిటర్నులు, బ్యాలెన్స్ షీట్లను ఆయా సంస్థల ఆడిటర్ల సమక్షంలో తనిఖీలు చేశారు. ఐటీ రిటర్నులకు సంబంధించిన అనుమానాలతో సాధారణంగా చేసిన తనిఖీలేనని అధికారులు తెలిపారు. హీరోలు వెంకటేష్, నాని ఇళ్లపైనా.. రామానాయుడు స్టూడియోకు సంబంధించి ఏడు చోట్ల తనిఖీలు జరుగుతుండగానే.. నటుడు వెంకటేష్ నివాసం (పుప్పాలగూడలోని డాలర్‌హిల్స్), అన్నపూర్ణ స్టూడియో, నటుడు నాని ఇల్లు, కార్యాలయం, అక్కినేని నాగార్జున ఇల్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరిగాయి. కూకట్పల్లి ఎమ్మెల్యేపైనా.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని వెంకట్రావునగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచే అధికారులు సోదాలు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్‌రావు డైరెక్టర్‌గా కొనసాగుతున్న ప్రణీత్ హోమ్స్ కంపెనీ కార్యాలయాలతోపాటు, ఎండీ నరేందర్, మరో ఐదుగురు డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. -
మాగుంటపై ఐటీ కొరడా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఐటీ పంజా విసిరింది. చెన్నైలోని మాగుంటకు చెందిన పలు కంపెనీలు, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఒకేసారిగా అధికారులు మూకుమ్మడి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.55 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల చెన్నైలో బంగారం హవాలా రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు విచారణ జరపగా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయట పడినట్లు తెలుస్తోంది. ఆ విచారణ ఆధారంగా ఐటీ అధికారులు చెన్నై ప్రాంతంలో దాదాపు 40 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. రెండు రోజలుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ మాగుంట కంపెనీలపైన ఐటీ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయాన్నే ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి చెన్నై నగర శివార్లలోని పూందమల్లి ప్రాంతంలో ఉన్న మాగుంటకు చెందిన బాలాజీ డిస్టిలరీ కంపెనీలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.55 కోట్ల నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మిగిలిన అధికారుల బృందం టీ నగర్లో ఉన్న మాగుంట ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి వరకు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులకు దిగడంతో నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో మాగుంటకు చెందిన కంపెనీలు, కార్యాలయాల్లో అలజడి రేగింది. మాగుంట అనుచరులతో పాటు ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి చెన్నైలోని మాగుంట కంపెనీలు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. బెంబేలెత్తుతున్న అధికార పార్టీ నేతలు : ఇటీవలే జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సీ ఫుడ్స్, ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కంపెనీలపైనా ఐటీ పెద్ద ఎత్తున దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంత నగదుతో పాటు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంతలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఎమ్మెల్సీ మాగుంటపైన ఐటీ దాడులకు దిగడంతో తెలుగుదేశం ముఖ్యనేతలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో అధికార పార్టీలో చాలా మంది నేతలు గ్రానైట్‌తో పాటు సీఫుడ్స్ వ్యాపారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. విదేశీ ఎగుమతులతో కోట్లాది రూపాయల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో వారంతా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు నగదుతో పాటు వ్యాపారలావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను రహస్య ప్రదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. -
మారుతీ, అశోక్ లేల్యాండ్ సప్లయిర్పై ఐటీ రైడ్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో దిగ్గజాలు మారుతీ సుజుకీ, అశోక్ లేల్యాండ్లకు అతిపెద్ద సప్లయర్ అయిన జై భారత్ మారుతీ(జేబీఎం) గ్రూప్‌పై ఐటీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున్న నగదు, బంగారం వెలుగులోకి వచ్చింది. ఆటో స్పేర్ పార్ట్‌లను తయారుచేసే అతిపెద్ద తయారీదారు అయిన జేబీఎం గ్రూప్‌కు చెందిన 50కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.7 కోట్ల నగదు, 3కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, గుర్గామ్, ఫరిదాబాద్, ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతాల్లోని జేబీఎం ఆఫీసులు, ప్రాపర్టీల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. నగదుతో పాటు స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మరుగుదొడ్లలో దాచిపెట్టినట్టు అధికారులు గుర్తించారు. గురువారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయని న్యూస్ ఏజెనీలు రిపోర్టు చేశాయి. విడిభాగాల తయారీదారి అయిన జై భారత్ మారుతీ గ్రూప్, ఆటోమేటివ్, ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సర్వీసులు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ రంగాల్లో తన సేవలందిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 35 తయారీ ప్లాంట్లను, 4 ఇంజనీరింగ్, డిజైన్ సెంటర్లున్నాయి. దీని టర్నోవర్ 1.2 బిలియన్ డాలర్లు. ఈ నెల మొదట్లో ఐటీ డిపార్ట్మెంట్ ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఐటీ దెబ్బ-ఉల్లి అబ్బా..!
సాక్షి, నాసిక్ : ఇన్కమ్ టాక్స్ అంటే నల్లకుబేరులు, అక్రమార్కులేకాదు.. ఉల్లి వ్యాపారుల కూడా భయం పట్టుకుంది. ఐటీ దాడులు జరుగుతున్నాయనే సరికి.. ఉల్లి వ్యాపారులు ధరలను అమాంతం నేలకు దించేశారు. ఎవరూ ఊహించనంత తక్కువ ధరకు ఉల్లిని అమ్మడం మొదలు పెట్టారు.. ఇదంతా ఎక్కడనుకుంటున్నారా?? ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకేం చదవండి. మహరాష్ట్రలోని అతి పెద్ద ఉల్లి హోల్‌సేల్ వ్యాపారాన్ని నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇక్కడున్న లాసల్గాన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) ఉల్లిని టోకుగా చిరువ్యాపారులుకు అమ్ముతుంది. ఈ మార్కెట్ కమిటీపై ఎవరూ ఊహించని విధంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏపీఎంసీ కార్యాలయాలు, గోడౌన్లు, నాసిక్‌లోని అతిపెద్ద ఉల్లి వ్యాపారస్తులైన ఏడుమంది ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో నాసిక్‌లో ఒక్కసారిగా ఉల్లిధరలు 35 శాతం తగ్గిపోయాయి. ఐటీ దాడులు జరపడానికి మునుపు క్వింటాల్ ఉల్లి రూ.1400 ధర పలికేది. దాడులు తరువాత క్వింటాల్ రూ.900కు దిగింది. ఈ విషయంపై ఏపీఎంసీ ఛైర్మన్ జయదత్తా హోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల వల్ల టోకు ధరలు పతనమయ్యాయని చెప్పారు. మార్కెట్‌కు వచ్చే ఉల్లిని రోజువారీ ధరల ప్రకారమే అమ్మడం.. కొనడం చేస్తున్నామని చెప్పారు. ఐటీ దాడుల అనంతరం రైతులు తమ ఉత్పత్తిని అమ్ముకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పారు. ఐటీ దాడుల వల్ల ఒక్కసారిగా ఉల్లిపాయల ధర నేలకు దిగిరావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండుమూడు నెలలుగా ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని.. వీటిని ఇలా అయినా నిరోధించడం మంచి పరిణామం అని కొనుగోలుదారులు అంటున్నారు. -
పార్లమెంట్లో ఐటీ దాడుల రగడ
కర్ణాటక మంత్రిపై ఐటీ దాడులతో కాంగ్రెస్ ఆందోళన ఐటీ దాడులకు, గుజరాత్ ఎన్నికలకు సంబంధం లేదు: జైట్లీ న్యూఢిల్లీ: కర్ణాటక మంత్రి శివకుమార్‌పై ఆదాయపన్ను శాఖ చేసిన దాడులు పార్లమెంట్‌ను కుదిపేశాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉభయ సభల్లోనూ కార్యకలాపాలను అడ్డుకు న్నారు. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను హైజాక్ చేసేందుకు ఈ దాడులు చేశారని ఆరోపించారు. అయితే రాజ్యసభ ఎన్నికలకు, ఐటీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించినా.. ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. కాంగ్రెస్ సభ్యుల నిరసనతో రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ఈ అంశాన్ని లేవనెత్తారు. గుజరాత్లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను హైజాక్ చేసేందుకే ఐటీ దాడులకు దిగారని ఆరోపించారు. దాడులు చేసిన ప్రదేశం, సమయం సరైనది కాదని, ఇవే దాడులను నెల ముందో నెల తర్వాతో ఎందుకు చేయలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ ప్రశ్నించారు. అటు లోక్‌సభలోనూ నిరసనకు దిగిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన మల్లిఖార్జున ఖర్గే.. రాజకీయ వేధింపులతోనే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉభయ సభల్లోనూ ఈ అంశంపై మాట్లాడిన జైట్లీ.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన కర్ణాటకలోని రిసార్ట్‌లో ఎటువంటి తనిఖీలు చేయలేదని వెల్లడించారు. రిసార్ట్‌లో ఉన్న మంత్రిని మాత్రం ప్రశ్నించేందుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. మొత్తం 39 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్టు చెప్పిన ఆయన.. రిసార్ట్‌లో మాత్రం సోదాలు చేయలేదని అన్నారు. అయితే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను వినియోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ విమర్శలను కర్ణాటక బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు బస కల్పించిన రిసార్ట్‌పై రూ. 942 కోట్ల జరిమానా విధించాలని సిద్దరామయ్య సర్కారు నిర్ణయించిందని.. ఇదే సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను అక్కడకు తీసుకొచ్చారని తెలిపారు. సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉన్నాం: భారత్‌పై సైబర్ దాడుల ప్రభావం తక్కువగానే ఉందని, అయినా ప్రభుత్వం వాటికి సంబంధించి అప్రమత్తంగా ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వద్ద సమాచారం ప్రకారం.. 2014–17 మధ్య దేశంలో ర్యాన్సమ్వేర్కు సంబంధించి 65 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.