పార్లమెంట్‌లో ఐటీ దాడుల రగడ
కర్ణాటక మంత్రిపై ఐటీ దాడులతో కాంగ్రెస్ ఆందోళన
ఐటీ దాడులకు, గుజరాత్ ఎన్నికలకు సంబంధం లేదు: జైట్లీ
న్యూఢిల్లీ: కర్ణాటక మంత్రి శివకుమార్‌పై ఆదాయపన్ను శాఖ చేసిన దాడులు పార్లమెంట్‌ను కుదిపేశాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉభయ సభల్లోనూ కార్యకలాపాలను అడ్డుకు న్నారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను హైజాక్ చేసేందుకు ఈ దాడులు చేశారని ఆరోపించారు. అయితే రాజ్యసభ ఎన్నికలకు, ఐటీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించినా.. ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు.
కాంగ్రెస్ సభ్యుల నిరసనతో రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ ఈ అంశాన్ని లేవనెత్తారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను హైజాక్ చేసేందుకే ఐటీ దాడులకు దిగారని ఆరోపించారు.
దాడులు చేసిన ప్రదేశం, సమయం సరైనది కాదని, ఇవే దాడులను నెల ముందో నెల తర్వాతో ఎందుకు చేయలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్ ప్రశ్నించారు. అటు లోక్‌సభలోనూ నిరసనకు దిగిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన మల్లిఖార్జున ఖర్గే.. రాజకీయ వేధింపులతోనే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉభయ సభల్లోనూ ఈ అంశంపై మాట్లాడిన జైట్లీ.. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన కర్ణాటకలోని రిసార్ట్‌లో ఎటువంటి తనిఖీలు చేయలేదని వెల్లడించారు.
రిసార్ట్‌లో ఉన్న మంత్రిని మాత్రం ప్రశ్నించేందుకు తీసుకెళ్లినట్టు చెప్పారు. మొత్తం 39 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్టు చెప్పిన ఆయన.. రిసార్ట్‌లో మాత్రం సోదాలు చేయలేదని అన్నారు. అయితే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను వినియోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ విమర్శలను కర్ణాటక బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు బస కల్పించిన రిసార్ట్‌పై రూ. 942 కోట్ల జరిమానా విధించాలని సిద్దరామయ్య సర్కారు నిర్ణయించిందని.. ఇదే సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను అక్కడకు తీసుకొచ్చారని తెలిపారు.
సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉన్నాం: భారత్‌పై సైబర్ దాడుల ప్రభావం తక్కువగానే ఉందని, అయినా ప్రభుత్వం వాటికి సంబంధించి అప్రమత్తంగా ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వద్ద సమాచారం ప్రకారం.. 2014–17 మధ్య దేశంలో ర్యాన్‌సమ్‌వేర్‌కు సంబంధించి 65 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.