సాక్షి, న్యూఢిల్లీ: ఆటో దిగ్గజాలు మారుతీ సుజుకీ, అశోక్ లేల్యాండ్‌లకు అతిపెద్ద సప్లయర్ అయిన జై భారత్ మారుతీ(జేబీఎం) గ్రూప్‌పై ఐటీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీ ఎత్తున్న నగదు, బంగారం వెలుగులోకి వచ్చింది. ఆటో స్పేర్ పార్ట్‌లను తయారుచేసే అతిపెద్ద తయారీదారు అయిన జేబీఎం గ్రూప్‌కు చెందిన 50కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.7 కోట్ల నగదు, 3కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, గుర్గామ్, ఫరిదాబాద్, ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ ప్రాంతాల్లోని జేబీఎం ఆఫీసులు, ప్రాపర్టీల్లో ఈ తనిఖీలు నిర్వహించారు.
నగదుతో పాటు స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మరుగుదొడ్లలో దాచిపెట్టినట్టు అధికారులు గుర్తించారు. గురువారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయని న్యూస్ ఏజెనీలు రిపోర్టు చేశాయి. విడిభాగాల తయారీదారి అయిన జై భారత్ మారుతీ గ్రూప్, ఆటోమేటివ్, ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సర్వీసులు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎడ్యుకేషన్ రంగాల్లో తన సేవలందిస్తోంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 35 తయారీ ప్లాంట్లను, 4 ఇంజనీరింగ్, డిజైన్ సెంటర్లున్నాయి. దీని టర్నోవర్ 1.2 బిలియన్ డాలర్లు. ఈ నెల మొదట్లో ఐటీ డిపార్ట్‌మెంట్ ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, 98 మంది ఎమ్మెల్యేలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment