‘గోరక్షక’ దాడులపై చర్చకు పట్టు
► లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
► వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు
న్యూఢిల్లీ: బిహార్‌లో తాజా రాజకీయ పరిణామాలు, గోరక్షకుల పేరిట దాడులు, ఇతర అంశాలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రారంభమైన 5 నిమిషాలకే సభ వాయిదా పడింది. స్పీకర్ ప్రశ్నోత్తరాల్ని ప్రారంభించగానే ఆర్జేడీ ఎంపీ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ లేచి.. బిహార్‌లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన నినాదాలు చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. తమ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘వివక్షకు ముగింపు పలకండి.. న్యాయం చేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే గోరక్షకుల దాడులపై చర్చించాలని కోరారు. తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను అరగంట వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభం కాగానే.. కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు నినాదాలు చేస్తూ గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక చర్చకు సిద్ధమని స్పీకర్ ప్రకటించినా.. ప్రతిపక్షాలు శాంతించలేదు. నిరసనల మధ్యే సభను స్పీకర్ కొనసాగించారు. కాగా లోక్‌సభలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాదాపు 5 నిమిషాల పాటు చర్చించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
టిబెట్‌లో అకృత్యాలపై చైనాకు నిరసన: సుష్మా
చైనాలో టిబెటన్లపై జరుగుతున్న అకృత్యాలు, అరుణాచల్ ప్రదేశ్ వాసులకు చైనా స్టేపుల్డ్ వీసాలు జారీ చేయడంపై రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానమిచ్చారు. అరుణాచల్ వాసులకు పాస్‌పోర్టుపై కాకుండా వేరుగా వీసా స్టాపింగ్ చేయడంపై ప్రతీ ద్వైపాక్షిక సమావేశంలో అభ్యంతరం చెపుతున్నామని సుష్మా తెలిపారు. టిబెట్లో అకృత్యాలపై ఎప్పటికప్పుడు చైనాకు భారత్ నిరసన తెలుపుతోందన్నారు. చైనా కంపెనీలకు భారత్‌లో భద్రతా అనుమతులు నిరాకరించే విధానమేదీ అమల్లో లేదని ఆమె వివరణ ఇచ్చారు. భారతీయ జర్నలిస్టుల టిబెట్ పర్యటనను చైనా రద్దు చేయడంపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి స్పందిస్తూ.. ఈ అంశంపై చైనా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు.
ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధ హోదా
ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధ హోదా కల్పించే బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) బిల్లు, 2017ను రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా ప్రతిపాదిత మోటార్ వాహనాల బిల్లుపై పార్టీలు తమ అభ్యంతరాల్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌కు అందచేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అఖిలపక్ష భేటీలో సూచించారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దాదాపు 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ లోక్‌సభకు తెలిపారు. అలాగే 30 శాతం నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు చలామణిలో ఉన్నాయని ఆయన చెప్పారు.