సంస్థాగత ఎన్నికలతో పార్టీకి పునరుత్తేజం: రాహుల్
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికలను పార్టీ పునరుత్తేజానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం మొదటిసారి సమావేశమైన రాహుల్.. సంస్థాగత ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. బోగస్ సభ్యులను తొలగించాలని, నకిలీ సభ్యత్వాలను ప్రోత్సహించవద్దని ఆదేశించారు. సంస్థాగత ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.
ఇందుకు సంబంధించి పూర్తి అధికారాలను ముల్లపల్లి రాంచంద్రన్ నేతృత్వంలోని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీకి ఇచ్చామని చెప్పారు. రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలువురు పీసీసీ అధ్యక్షులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ 2015 మొదట్లో ప్రారంభమై, జూలై 5 -25 తేదీల మధ్య నూతన అధ్యక్ష ఎన్నికతో ముగుస్తుంది. ఈ సంవత్సరం సంస్థాగత ఎన్నికలను 100% పారదర్శకంగా నిర్వహిస్తామని రామచంద్రన్ పేర్కొన్నారు.