బంగ్లాదేశ్‌కు మన విద్యుత్
♦ బదులుగా భారత్‌కు ఇంటర్‌నెట్ బ్యాండ్‌విడ్త్
♦ ఈ ఒప్పందం చరిత్రాత్మకం: మోదీ
న్యూఢిల్లీ/అగర్తలా: బంగ్లాదేశ్, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. బుధవారం నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించింది. బదులుగా ఆ దేశం 10 జీబీపీఎస్ ఇంటర్‌నెట్ బ్యాండ్‌విడ్త్‌ను అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని, ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుం దని మోదీ అభివర్ణించారు. ఇరు దేశాలు ప్రగతి పథంలో సాగేందుకు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.
‘ఇప్పటికే మనకు పశ్చిమ, దక్షిణ ఇంటర్నెట్ గేట్‌వేలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పున కూడా ప్రధానమైన ఇంటర్నెట్ గేట్‌వే ఏర్పడింది’ అని అన్నారు. బంగ్లాతో ఏర్పడిన ఈ ఈశాన్య గేట్‌వే అస్సాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు కనెక్టివిటీని ఏర్పరచిందన్నారు. భవిష్యత్‌లో అంతరిక్ష పరిశోధనల్లోనూ ఇరు దేశాలు భాగస్వామ్యం కావాలన్నారు. ఒప్పందం సంబంధాలను పెంపొందించిందని, పలు రంగాల్లో కలసి సాగాలని అభిలషిస్తున్నానని హసీనా అన్నారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా వేసిన 400కేవీడీసీ లైన్ల ద్వారా త్రిపుర నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.
2 నెలల్లో ఫిర్యాదులను పరిష్కరించాలి!
ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ సూచించారు. ఫిర్యాదులు లేదా వినతులు అందిన 60 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నెలలోపు ఆ విధానం అమల్లోకి రావాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం ప్రజాస్వామ్యంలో కీలకమన్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని భూ రికార్డులను ఆధార్‌తో అనుసంధానించాలని సూచించారు. కంప్యూటర్ ఆధారిత ‘ప్రగతి’ వేదిక ద్వారా బుధవారం వారితో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైల్వేస్, విద్యుత్, చమురు రంగాల్లోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని సమీక్షించారు.