
లక్నో : పద్మావతి చలనచిత్ర విడుదలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు గురువారం లేఖ రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న చిత్రానికి ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్ బోర్డు పరిశీలించాలకే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
చిత్ర విడుదలకు ముందే దిష్టి బొమ్మల దహనం, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని.. విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్ హోం శాఖ అధికారి అరవింద్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. చిత్రాన్ని ప్రదర్శించొద్దంటూ సినిమా థియేటర్ యజమానులకు బెదిరింపు లేఖలు కూడా వస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరో వైపు నవంబర్ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటికి డిసెంబరు 1న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని అరవింద్‌కుమార్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రాన్ని రాజ్‌పుత్ వర్గీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment