గూఢచర్యం కేసు... వీసా ఏజెంట్ అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న గూఢచర్యం కేసులో జోధ్‌పూర్ వీసా ఏజెంట్ షోయబ్‌ను పోలీసులు అరెస్టు చేసి, శుక్రవారం ఢిల్లీకి తరలించారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సతీష్ అరోరా ముందు ప్రవేశపెట్టారు. 11 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. రాకెట్ సూత్రధారి, పాక్ హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌తో ఇతడిది నాలుగేళ్ల పరిచయమని పోలీసులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతడి వద్దనున్న ఫ్యాబ్లెట్‌ను ధ్వంసం చేయబోయాడని, దాన్ని స్వాధీనం చేసుకుని డేటారికవరీకి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు సుభాష్, మౌలానా రంజాన్‌తో కలిపి షోయబ్‌ను విచారిస్తామన్నారు. ‘ఈ మాడ్యూల్‌లో సుభాష్, మౌలానాలను రిక్రూట్ చేసుకుంది షోయబే. పాక్‌కు ఆరుసార్లు వెళ్లివచ్చాడు’ అని జాయింట్ కమిషనర్(క్రైమ్) రవీంద్ర యాదవ్ తెలిపారు. గురువారం సాయంత్రం షోయబ్‌ను జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబై తరహా దాడులకు యత్నం
రక్షణ సమాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్న పాక్ హైకమిషన్ ఉద్యోగి అక్తర్... 2008 ముంబై తరహా ఉగ్ర దాడులకు కుట్ర పన్నినట్టు కేంద్ర హోం శాఖ ప్రతినిధి తెలిపారు. సముద్ర మార్గం ద్వారా వచ్చి ముంబైలో దాడులకు తెగబడినట్టుగానే... ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి మళ్లీ విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్‌ఐ సన్నద్ధమవుతున్నట్టు నిఘా సమాచారం అందిందన్నారు. అందులో భాగంగానే పశ్చిమ తీర ప్రాంతాలైన సర్ క్రీక్, కచ్‌లతో పాటు గుజరాత్, గోవాల్లోని మిలిటరీ స్థావరాలసమాచారాన్ని అక్తర్ సేకరించాడన్నారు. మౌలానా, సుభాష్‌లు క్రీక్, కచ్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను అక్తర్‌కు చేరవేసేటప్పుడు గురువారం వారిని అరెస్టు చేశామన్నారు.