కాల్పుల విరమణపై మళ్లీ తూటా
సరిహద్దులో కాల్పులకు తెగబడిన పాక్ సైన్యం
ఇద్దరు జవాన్లు, ఓ మహిళ మృతి
శ్రీనగర్/జమ్మూ: పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణకు మళ్లీ తూట్లు పొడిచి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సరిహద్దుల వెంట కాల్పులు జరిపి ఇద్దరు జవాన్లు సహా ఓ మహిళను పొట్టనబెట్టుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కతువా, సాంబా జిల్లాల్లో పాక్ సైన్యం ఈ ఘాతుకానికి తెగబడింది. ఈ కాల్పుల్లో 11 మంది పౌరులు కూడా గాయపడ్డారు. కాల్పుల మోత, మోర్టార్ల దాడితో సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. 1,400 మందికి పైగా ప్రజలు ఊళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచే పాక్ సైన్యం ఈ కాల్పులకు దిగిందని బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ తెలిపారు.
భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టడంతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కాసేపు కాల్పులు ఆపినా.. ఉదయం 7 గంటల సమయంలో మళ్లీ జనావాసాలపై మోర్టార్లతో దాడి చేసిందని వివరించారు. కతువా, సాంబా జిల్లాల్లోని 15 సరిహద్దు ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్ ఈ కాల్పులు సాగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని, కొన్నిచోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని సాంబా ఎస్పీ అనిల్ మగోత్రా పేర్కొన్నారు. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని, కొందరు బంకర్లలో తలదాచుకున్నారని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చెప్పారు. ప్రస్తుతానికి నాలుగు గ్రామాలవారిని తరలించామన్నారు. పహార్‌పూర్, కతావ్, చరు, లొండి, పట్టి, కరోల్ గ్రామాలు, సాంబా సెక్టార్‌లో ఖ్వారా, రెగల్, చిల్యారి, మాంగుచాక్, చచ్యాల్, రామ్‌గఢ్, మలూచాక్, సుచేత్‌గఢ్ కులియన్, మావాలపై పాక్ కాల్పులు జరిపిందన్నారు. చనిపోయిన మహిళను మాంగుచాక్‌కు చెందిన టారి దేవిగా గుర్తించినట్లు తెలిపారు.
చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం
శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఎనిమిది మంది ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు యత్నిం చారు.భారత బలగాలు సకాలంలో గుర్తించి కాల్పులు జరపడంతో వారు వెనక్కి తగ్గారు. ఇది జరిగిన కాసేపటికే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
స్నేహహస్తం చాచినా ఇలాగేనా?: తాము స్నేహహస్తం చాచినా పాక్ కాల్పులకు తెగబడుతూ కవ్విస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఆ దేశం పద్ధతిని మార్చుకోవాలన్నారు.
‘రేంజర్ల’పై అబద్ధాలేల?: సుష్మా
న్యూఢిల్లీ: పాక్ రేంజర్లను కాల్చి చంపారంటూ ఆ దేశం చేస్తున్న ఆరోపణలను భారత్ ఖండించింది. సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణానికి భంగం కలగకుండా వ్యవహరించాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 31న భేటీకి పిలిచి భారత్ ఇద్దరు పాక్ రేంజర్లను కాల్చి చంపిందని అజీజ్ ఆరోపించారు. అయితే భారీ ఆయుధాలతో జనావాసాలపై కాల్పులు జరుపుతుండగా తమ బలగాలు ప్రతిఘటించాయని, ఈ సందర్భంగానే పాక్ రేంజర్లు మరణించారని సుష్మా స్పష్ట్టం చేశారు.
2014లో 550 ఉల్లంఘనలు..
2014లో భారత సరిహద్దుల వెంట పాక్ ఏకంగా 550 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 2003లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఒక ఏడాదిలో ఇన్నిసార్లు ఉల్లంఘించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఆగస్టు, అక్టోబర్‌లో కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు సహా 13 మంది పౌరులు మరణించారు. 32 వేల మంది వలస వెళ్లారు. మొత్తమ్మీద కిందటేడాది పాక్ కాల్పుల్లో 19 మంది పౌరులు, ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా 150 మంది గాయాలపాలయ్యారు.