
జమ్మూ/శ్రీనగర్: దాయాది దేశం పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న పూంచ్, దిగ్వార్, షాపూర్, కస్బా, కెర్నీ, మంధార్ సెక్టార్లలోని భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు మోర్టార్లు, మెషీన్‌గన్లతో కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఇద్దరు మైనర్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. పాక్ దాడిని భారత బలగాలు ధీటుగా తిప్పికొట్టాయని రక్షణశాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. పాక్ ఆక్రమితక కశ్మీర్(పీవోకే) నుంచి జమ్మూకశ్మీర్‌లోని రామ్‌పూర్, తంగ్‌ధార్ సెక్టార్లలో భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చిచంపాయి. ఈ రెండు ఘటనల్లో ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామనీ, ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.