సమైక్య నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : సీమాంధ్ర ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. సమైక్య ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకుపోయారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. సీమాంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు కూడా చేశారు. సభలో పరిస్థితులు సద్దుమణగకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
వాయిదా అనంతరం ఇరు సభలు ప్రారంభమైన సీమాంధ్ర సభ్యులు తమ పట్టు వీడలేదు. లోక్ సభలో సభ్యుల నిరసనల మధ్యే రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ... మధ్యంతర రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనూ సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల ఆందోళనలు కొనసాగాయి. వైఎస్ఆర్ సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపాలంటూ ప్లకార్డుతో స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయనను అనుసరించారు.
కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకుపోయారు. కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆందోళనకు దూరంగా ఉన్నారు. దాంతో బడ్జెట్ ప్రసంగాన్ని రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే మధ్యలోనే ఆపేశారు. తాను చదవినట్టుగానే భావించాలంటూ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. సీమాంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు కూడా చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.