బీజేపీకి తొలిస్థానం | Parties spent over Rs 573 cr during 2016 Assembly polls in five states, reveals ADR report | Sakshi
Sakshi News home page

బీజేపీకి తొలిస్థానం

Published Fri, Jul 7 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

బీజేపీకి తొలిస్థానం

బీజేపీకి తొలిస్థానం

నిధుల వ్యయం, సేకరణలో కమలం పార్టీ ఫస్ట్‌
ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యయం రూ.573 కోట్లు!
పార్టీలు సేకరించింది రూ.355 కోట్లే
ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి


న్యూఢిల్లీ: గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.573 కోట్లు ఖర్చు చేశాయి. అయితే అవి సేకరించిన మొత్తం రూ. 355 కోట్లేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌(ఏడీఆర్‌) నివేదిక స్పష్టం చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీల నిధుల వ్యయం, సేకరణకు సంబంధించిన గణాంకాలను పొందుపరచి ఈ నివేదికను విడుదల చేశారు.

ముఖ్యాంశాలు:
జాతీయ పార్టీలు సేకరించిన నిధులు రూ.287.89 కోట్లు కాగా, వ్యయం చేసినది రూ.188.12 కోట్లు. ప్రాంతీయ పార్టీలు 67.22 కోట్లు వసూలు చేసి 213.97 కోట్లు ఖర్చు చేశాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి రూ.573.24 కోట్లు ఖర్చు చేశాయి. వీటిలో ప్రచార, ప్రయాణ, ఇతర ఖర్చులు, అభ్యుర్థులకు ఇచ్చే మొత్తం తదితరాలున్నాయి. జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా సేకరించిన రూ.131.72 కోట్లు... జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆరు జాతీయ పార్టీలు సేకరించిన దానిలో 45.75 శాతానికి సమానం. జాతీయ స్థాయిలో అయిన 112.14 కోట్ల వ్యయంలో బీజేపీ అత్యధికంగా రూ.84.36 కోట్లను ఖర్చు చేసింది.

రాష్ట్రస్థాయిలో కేరళ బీజేపీ యూనిట్‌ అత్యధికంగా 14.11 కోట్లు, తరువాత పశ్చిమ బెంగాల్‌ యూనిట్‌ రూ.5.70 కోట్లు, అస్సాం యూనిట్‌ రూ. 4.03 కోట్లు ఖర్చు చేశాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ రూ.41.49 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.14.57 కోట్లు(లేదా 35.12 శాతం) జాతీయ స్థాయిలోనే వ్యయమయ్యాయి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే...ఎస్పీ అత్యధికంగా రూ.35.66 కోట్లు సేకరించింది. డీఎంకే అత్యధికంగా రూ.97.34 కోట్లు ఖర్చు చేసింది.

బీజేపీ సేకరించిన మొత్తం నిధుల్లో 65.53 శాతం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వచ్చాయి. రూ.94.23 కోట్లు సేకరించి కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో గానీ, కేంద్ర స్థాయిలో గానీ ఎలాంటి నిధులు సేకరించలేదని బీఎస్పీ ప్రకటించింది. జాతీయ పార్టీలు తమ అభ్యర్థులకు రూ.151.65 కోట్లు ఇవ్వగా, ప్రాంతీయ పార్టీలు అభ్యర్థులపై రూ.60.89 కోట్లు ఖర్చు చేశాయి. మీడియాలో ప్రకటనలకు జాతీయ పార్టీలు రూ.82.08 కోట్లు, ప్రాంతీయ పార్టీలు రూ.95.49 కోట్లు ఖర్చు చేశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement