2018 నాటికి ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: 2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారమిక్కడ డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహర్షి మీడియాతో మాట్లాడుతూ.. ‘కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పటికే సీసీటీఎన్‌ఎస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా అందించే స్మార్ట్‌ఫోన్ లాంటి పరికరంతో పోలీసులు పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు ఇంటికి చేరుకుని వివరాలను అప్‌లోడ్ చేస్తారు. దీనివల్ల సమయం తగ్గుతుంద’ని వెల్లడించారు. దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్‌ఎస్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.