అఫ్జల్‌ గురు ఉరితీతకు ప్రతీకారంగానే..! | Pathankot terrorists spoke of revenge for Afzal Guru: Gurdaspur man | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌ గురు ఉరితీతకు ప్రతీకారంగానే..!

Published Sat, Jan 2 2016 8:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

Pathankot terrorists spoke of revenge for Afzal Guru: Gurdaspur man

పఠాన్‌కోట్‌: గురుదాస్‌పుర్ వాసి అయిన రాజేశ్‌ వర్మ అదృష్టవంతుడనే చెప్పాలి. శుక్రవారం ఉదయం ఆయనను నలుగురు సాయుధ ఉగ్రవాదులు అపహరంచుకుపోయారు. ఆ తర్వాత ఆయన గొంతు కోసి.. చనిపోయి ఉంటాడని భావించి వదిలేసి పోయారు. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడ్డ ఆయన.. పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్‌ గురు మరణానికి ప్రతీకారంగా తాము పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడుతున్నట్టు ఉగ్రవాదులు తెలిపారని ఆయన చెప్పారు.  

'మిత్రుడైన ఎస్పీ సల్విందర్‌సింగ్‌, ఆయన వంటమనిషితో కలిసి మేం సరిహద్దుల సమీపంలోని నోరాత్‌ జైమాల్‌సింగ్‌ బ్లాక్‌కు వెళ్లి నివాళులర్పించాం. అనంతరం తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ ఉగ్రవాదులు మా వాహనాన్ని అడ్డగించారు. ఆర్మీ యూనిఫాంలు ధరించి.. భారీ ఆయుధాలతో ఉన్న వారు మమ్మల్ని బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకున్నాను. మా ముగ్గురిని తాళ్లతో బంధించి తీవ్రంగా కొట్టారు' అని ప్రస్తుతం ఆస్పత్రి బెడ్‌ మీద కోలుకుంటున్న రాజేశ్‌ వర్మ తెలిపారు. 'అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారంగానే మేం ఎయిర్‌బేస్‌పై దాడి చేయబోతున్నామని వారు చెప్పారు. 'మీరు అఫ్జల్‌ గురును చంపారు. మేం ప్రతీకారం తీర్చుకుంటాం' అని ఉగ్రవాదులు పదేపదే చెప్పారు. వారి వద్ద భారీ ఆయుధాలతోపాటు, జీపీఎస్‌ నావిగేషన్ సిస్టం కూడా ఉంది. ఎయిర్‌బేస్‌ ఎక్కడుందో కూడా వారికి స్పష్టంగా తెలుస' అని ఆయన చెప్పారు. ' ఆ తర్వాత ఎస్పీని, అతని వంటవాడిని వదిలేశారు. నన్ను మాత్రం వెంట తీసుకెళ్లి నిత్యం కొడుతూ పోయారు. ఎయిర్‌బేస్‌ కొంత దూరంలో నా గొంతు కత్తితో కోసి.. చనిపోయి ఉంటానని భావించి వాహనం నుంచి కింద పడేసి పోయారు. కానీ నేను మాత్రం బతుకడానికి ప్రయత్నించారు. రక్తస్రావం కాకుండా గొంతు చుట్టు వస్త్రాన్ని కట్టుకున్నాను. ఆ తర్వాత సమీపంలోని గురుద్వారలోకి పరుగెత్తికెళ్లి అక్కడ ఉన్న వారి ద్వారా మా కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయించాను. వారు నన్ను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలు దక్కాయి' అని ఆయన వివరించారు.

పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement