ఆస్పత్రిలో డాన్సులు.. రోగులకు అవస్థలు
బులంద్ షహర్: ప్రభుత్వాసుపత్రిని ఫంక్షన్ హాల్ లా మర్చేశాడో ఉద్యోగి. రోగులకు స్వస్థత చేకూర్చాల్సిన చికిత్సాలయాన్ని సొంత పనులకు వాడుకుని అపహాస్యం చేశాడు. రోగులకు తీవ్ర అసౌకర్యం కలగజేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఫిబ్రవరి 28న జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆస్పత్రి ఉద్యోగి ఒకరు తన కూతురు వివాహాన్ని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించాడు. వివాహ వేడుకల్లో భాగంగా పాటలు, డాన్సులు హోరెత్తించడంతో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు, నర్సులతో సహా సిబ్బంది అంతా పెళ్లికి వెళ్లిపోవడంతో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ఆస్పత్రి సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని చికిత్స పొందుతున్న వృద్ధుడు ఒకరు వాపోయారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రసవం కోసం ఓ నిండు చూలాలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయం.