Patients suffer
-
వైద్యులు రోడ్డెక్కి.. గుండెలు బరువెక్కి!
కర్నూలు: కొన్ని దృశ్యాలను చూస్తే మాటలు రావు. ఆ బాధ, ఆవేదన కన్నీళ్లకు మాత్రమే అర్థమవుతుంది. రేయింబవళ్లు రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయతించే వైద్యుల మాన, ప్రాణాలకే రక్షణ లేకుండాపోతుంది. ఇందుకు పశ్చిమ బెంగాల్ లో ఓ మానవ మృగం వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనతో రుజువైంది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు ఇదివరలో కోకొల్లలు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబంలో ఒకరికి ప్రాణాల మీదకు వస్తే ఆవేదన వర్ణనాతీతం. కళ్లెదుట ప్రాణం పోతుందంటే, నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్న బంధం వీడి వెళ్లిపోతుందంటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. ఇలాంటి రెండు దృశ్యాలకు ఈ ఫొటో అద్దం పడుతుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో న్యాయం కోసం జూనియర్ వైద్యులు ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీగా వెళ్తుండగా.. అదే సమయంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని బంధువులు స్ట్రెచ్చర్‌పై అత్యవసర వైద్యానికి తీసుకెళ్తున్న దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. -
వైద్యమేది మహాప్రభో!
ముంబై: మూకుమ్మడి సెలవు పేరిట ప్రభుత్వ వైద్యులు బుధవారం సైతం విధులకు గైర్హాజరు కావడంతో ముంబైలో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నాలుగురోజులుగా ముంబైలోని ప్రభుత్వ, మున్సిపాలిటీ ఆస్పత్రులలో కనీస వైద్య చికిత్స అందించేందుకు సైతం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పేదరోగుల పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఔట్ పేషంట్ విభాగం మొదలుకొని అత్యవసర సేవల వరకు అన్నింటినీ డాక్టర్లు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రులనే నమ్ముకున్న నిరుపేద రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ’వైద్యుల ముకుమ్మడి సెలవు వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం. అనారోగ్యంతో ఉన్న రోగులను ఇలా వారి ఖర్మకు వారిని వదిలేయడం భావ్యం కాదు. వైద్యులు తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తించాలి’ అని ఓ రోగి బంధువు పేర్కొన్నారు. ’నా భార్యకు కాలిన గాయాలయ్యాయి. నాలుగురోజుల నుంచి ఆమెకు చికిత్స అందించడం లేదు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది’ అని మరో వ్యక్తి ముంబైలోని సియాన్ ఆస్పత్రి వద్ద విలపిస్తూ కనిపించాడు. రోగుల బంధువుల విధుల్లో ఉన్న వైద్యుల దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యుల మూకుమ్మడి సెలవుపై తీవ్రంగా స్పందించిన బొంబాయి హైకోర్టు వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది. అయినా బుధవారం వైద్యులు విధుల్లో చేరకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. విధులకు రాని సీనియర్ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీచేసి.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఆదేశించింది. -
ఎంజీఎం కిటకిట
విష జ్వరాలతో పెద్దసంఖ్యలో దవాఖానలో చేరుతున్న రోగులు వేధిస్తున్న పడకల కొరత పడకేసిన వార్డుల నిర్వహణ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా భావించే ఎంజీఎం దవాఖాన సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించలేకపోతోంది. ఫలితంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 383 మంది మలేరియా, 67 మంది డెంగీ బారిన పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తం మీద ఈ అంచనా గణాంకాలను బట్టి ఏజెన్సీ ప్రాంతాలు సీజనల్ వ్యాధులతో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయనేది వాస్తవం. గత వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు చోటుచేసుకుంటున్న వాతావారణ మార్పుల కారణంగా ప్రజలు జ్వరాలతో సతమతం అవుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సరైన వైద్యసేవలు అందడం లేదు. ఇక జిల్లాలోనే పెద్దాస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలోనూ అదే విధమైన దుస్థితి తాండవిస్తోంది. ప్రధానంగా ఈ ఆస్పత్రిలో రోగులకు పడకల కొరత ప్రధాన సమస్యగా ఉంది. అదనపు వార్డులు, పడకలను సమకూర్చుకోవడంపై ఎంజీఎం వైద్యాధికారులు దృష్టిసారించడం లేదు. వారి తీరుపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా పిల్లల వార్డు.. ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ప్రస్తుతం 350 మంది చిన్నారులు విషజ్వరాజలతో చికిత్స పొందుతున్నారు. వారిలో అధికులు ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. అయినా ఆయా ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం లేదు. దవాఖానలోని పిల్లల విభాగంలోని వార్డుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. 138 పడకలకుగానూ 346 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. పడకల కొరత కారణంగా ఒకే పడకలో ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులు చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లల వార్డులో ఏసీ పనిచేయకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పడకేసింది. దీనికి తోడు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటంతో ఆయా వార్డులకు రోగుల బంధువుల తాకిడి బాగా పెరిగిపోయి సంత వాతావరణం కనిపిస్తోంది. ప్రైవేటు క్లినిక్‌లకు రోగులను తరలించకుంటూ.. ఎంజీఎంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన వైద్యులు మధ్యాహ్న అయిందంటే చాలు కనిపించకుండా పోతున్నారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రోగులు లోలోన కుమిలిపోతున్నారు. కొంతమంది డాక్టర్లు రోగులను తమ ప్రైవేటు క్లినిక్‌లకు తరలించుకొని, ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులు పక్కా నిఘా ఉంచితే వివరాలన్నీ బట్టబయలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎంజీఎంలో వైద్యసేవలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఆస్పత్రిలో డాన్సులు.. రోగులకు అవస్థలు
బులంద్ షహర్: ప్రభుత్వాసుపత్రిని ఫంక్షన్ హాల్ లా మర్చేశాడో ఉద్యోగి. రోగులకు స్వస్థత చేకూర్చాల్సిన చికిత్సాలయాన్ని సొంత పనులకు వాడుకుని అపహాస్యం చేశాడు. రోగులకు తీవ్ర అసౌకర్యం కలగజేశాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఫిబ్రవరి 28న జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి ఉద్యోగి ఒకరు తన కూతురు వివాహాన్ని ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించాడు. వివాహ వేడుకల్లో భాగంగా పాటలు, డాన్సులు హోరెత్తించడంతో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. వైద్యులు, నర్సులతో సహా సిబ్బంది అంతా పెళ్లికి వెళ్లిపోవడంతో రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డామని చికిత్స పొందుతున్న వృద్ధుడు ఒకరు వాపోయారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రసవం కోసం ఓ నిండు చూలాలు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయం.