
కర్నూలు: కొన్ని దృశ్యాలను చూస్తే మాటలు రావు. ఆ బాధ, ఆవేదన కన్నీళ్లకు మాత్రమే అర్థమవుతుంది. రేయింబవళ్లు రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయతించే వైద్యుల మాన, ప్రాణాలకే రక్షణ లేకుండాపోతుంది. ఇందుకు పశ్చిమ బెంగాల్ లో ఓ మానవ మృగం వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనతో రుజువైంది.
ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు ఇదివరలో కోకొల్లలు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబంలో ఒకరికి ప్రాణాల మీదకు వస్తే ఆవేదన వర్ణనాతీతం. కళ్లెదుట ప్రాణం పోతుందంటే, నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్న బంధం వీడి వెళ్లిపోతుందంటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది.
ఇలాంటి రెండు దృశ్యాలకు ఈ ఫొటో అద్దం పడుతుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో న్యాయం కోసం జూనియర్ వైద్యులు ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీగా వెళ్తుండగా.. అదే సమయంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని బంధువులు స్ట్రెచ్చర్‌పై అత్యవసర వైద్యానికి తీసుకెళ్తున్న దృశ్యం అందరి హృదయాలను కదిలించింది.