వైద్యమేది మహాప్రభో!
ముంబై: మూకుమ్మడి సెలవు పేరిట ప్రభుత్వ వైద్యులు బుధవారం సైతం విధులకు గైర్హాజరు కావడంతో ముంబైలో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నాలుగురోజులుగా ముంబైలోని ప్రభుత్వ, మున్సిపాలిటీ ఆస్పత్రులలో కనీస వైద్య చికిత్స అందించేందుకు సైతం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పేదరోగుల పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఔట్ పేషంట్ విభాగం మొదలుకొని అత్యవసర సేవల వరకు అన్నింటినీ డాక్టర్లు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రులనే నమ్ముకున్న నిరుపేద రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
’వైద్యుల ముకుమ్మడి సెలవు వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం. అనారోగ్యంతో ఉన్న రోగులను ఇలా వారి ఖర్మకు వారిని వదిలేయడం భావ్యం కాదు. వైద్యులు తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తించాలి’ అని ఓ రోగి బంధువు పేర్కొన్నారు. ’నా భార్యకు కాలిన గాయాలయ్యాయి. నాలుగురోజుల నుంచి ఆమెకు చికిత్స అందించడం లేదు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది’ అని మరో వ్యక్తి ముంబైలోని సియాన్ ఆస్పత్రి వద్ద విలపిస్తూ కనిపించాడు.
రోగుల బంధువుల విధుల్లో ఉన్న వైద్యుల దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యుల మూకుమ్మడి సెలవుపై తీవ్రంగా స్పందించిన బొంబాయి హైకోర్టు వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది. అయినా బుధవారం వైద్యులు విధుల్లో చేరకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. విధులకు రాని సీనియర్ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీచేసి.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఆదేశించింది.