
ముంబై: మార్జిన్లు పెంచడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్ని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు పెట్రో డీలర్ల సంఘం యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్(యూపీఎఫ్) తెలిపింది. గడువులోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే అక్టోబర్ 27 నుంచి పెట్రో ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా నిలిపివేస్తామని హెచ్చరించింది.
డీలర్ల మార్జిన్లను ఏడాదికి రెండుసార్లు సవరించటంతో పాటు రవాణా చార్జీలు, ఇథనాల్ కలపడం వంటి డిమాండ్లపై గతేడాది నవంబర్‌లో కుదిరిన ఒప్పందాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) అమలు చేయనందునే ఈ సమ్మె చేపడుతున్నట్లు యూపీఎఫ్ స్పష్టం చేసింది. ఈ విషయమై ఓఎంసీలు, కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది.
డీలర్లపై ఓఎంసీలు గరిష్టంగా రూ.2లక్షల వరకు జరిమానా విధించటాన్ని, రోజువారీగా పెట్రో ధరల్ని సవరించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యూపీఎఫ్ పేర్కొంది. రోజువారీ ధరల సవరణ వల్ల డీలర్లు , వినియోగదారుల్లో ఎవ్వరూ లాభపడలేదని విమర్శించింది. ప్రస్తుతం యూపీఎఫ్ కింద 54,000 మంది డీలర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment