
ఆదివారాలు పెట్రోల్ బంద్
మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో అమలు
చెన్నై: మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు మూతపడనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హరియాణాల్లోని సుమారు 20 వేల పెట్రోల్ పంపుల్లో ఆ ఒక్కరోజు ఇంధన అమ్మకాలు నిలిచిపోతాయని ఇండియన్ పెట్రోలియం కన్సార్షియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ‘ఆదివారం పెట్రోల్ పంపులను మూసివేయాలని చాలా ఏళ్ల నుంచే అనుకుంటున్నాం.
అయితే మా నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కోరడంతో ఆగిపోయాం. ఇప్పుడిక దానినే అమలుచేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. ఇంధనాన్ని పొదుపుగా వాడుకుని పర్యావరణాన్ని కాపాడాలని ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ చేసిన సూచన మేరకే అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘తమిళనాడులో ఆదివారం ఒక్కరోజు పెట్రోల్ పంపులు మూసివేస్తే సుమారు రూ.150 కోట్ల నష్టం కలుగుతుందని అంచనావేస్తున్నాం’ అని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తెలియజేయలేదన్నారు. 15 మంది సిబ్బంది పనిచేస్తున్న బంకుల్లో మాత్రం సెలవు రోజులోనూ ఒకరిని విధుల్లో ఉంచుతామన్నారు.
బీజేపీలోకి అర్వీందర్ లవ్లీ
న్యూఢిల్లీ: ఢిల్లీ శాఖ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మంగళవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో అర్వీందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారత రాజకీయాలకు ప్రధాని మోదీ, అమిత్‌షాలు కొత్త అర్థంచెప్పారని అర్వీందర్ అన్నారు. ఈయన గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ సర్కారులో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ముడుపులు ముట్టజెప్పిన వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తోందన్నారు.