పైలట్ చేతివాటం
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ సీనియర్ పైలట్ ముంబై విమానాశ్రయంలో చేతివాటం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకొని... బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు. గురువారం జరిగిందీ సంఘటన. ముంబై విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీ షాపులోకి వెళ్లి రెండు జతల కళ్లద్దాలు ఖరీదు చేశాడు సదరు పైలట్. అయితే చడీచప్పుడు కాకుండా మూడో కళ్లజోడును జేబులో పెట్టేసుకున్నాడు.
అనంతరం డ్యూటీలో భాగంగా విమానం నడుపుతూ తిరువనంతపురం వెళ్లిపోయాడు. సీసీ టీవీల్లో ఫుటేజీ చూసిన షాపు సిబ్బంది జరిగిన చోరీని గుర్తించారు. సదరు పైలట్ తిరువనంతపురం నుంచి తిరిగి ముంబై రాగానే అడ్డగించారు. ఫుటేజీ చూపించేసరికి గతుక్కుమన్న పైలట్ పరువు పోకుండా ఉండటానికి రాజీకి వచ్చాడు. చోరీ చేసిన కళ్లద్దాల ఖరీదు 24 వేల రూపాయలు కాగా... దానికి పది రెట్లు 2.4 లక్షలు జరిమానా కట్టి బయటపడ్డాడు. విషయం బయటకు పొక్కి ఎయిర్ ఇండియా సంస్థను సంప్రదించగా... ‘ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సమస్య సద్దుమణిగింది’ అని వివరణ ఇచ్చింది.