రెప్పపాటులో ప్రాణాలు పోయాయి
ముంబై: ముంబైలోని బోరివాలి రైల్వేస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్యనున్న గ్యాప్ కిరణ్ కొఠారి (55)ని పొట్టనపెట్టుకుంది. అనారోగ్యంతో ఉన్న సోదరుడిని పరామర్శించేందుకు వచ్చిన తమ బంధువు, తిరిగిరాని లోకాలకు తరలిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కిరణ్ కొఠారి ముంబైలో తన సోదరుడిని చూసి తిరిగి గుజరాత్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. పొరపాటున వేరే రైలు ఎక్కిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆమె.. కదులుతున్న రైల్లోంచి దిగుతూ.. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఉన్న సందులో చిక్కుకుపోయింది. వెంటవున్న బంధువు తరుణ్ సిధ్వి ఆమెను రక్షించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అందరూ చూస్తుండగానే.. విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో అక్కడున్నవారంతా దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఈ దృశ్యాలు స్టేషన్ లోని సీసీ టీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి.
దీంతో రైల్వేశాఖ నిర్లక్ష్యంపై విమర్శలు చెలరేగాయి. ఇది చాలా విచారకరమైన సంఘటన అని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. కాగా అధికారిక గణాంకాల ప్రకారం బోరివలి స్టేషన్ లో ఇలాంటివి మొత్తం 28 అటువంటి సంఘటనలు చోటుచేసుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే ప్లాట్పాంకి, పట్టాలకు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.