భారత్-అమెరికా ప్రతిన ద్వైపాక్షిక భాగస్వామ్య
శక్తిని వెలికితీయాలి ‘వాషింగ్టన్ పోస్ట్’కు
మోదీ-ఒబామా సంయుక్త కథనం
వాషింగ్టన్: నూతన ఎజెండాతో 21వ శతాబ్దానికి సరికొత్త భాగస్వామ్యాన్ని ఆవిష్కరించేందుకు కలసి ముందుకు సాగుతామని (చలే సాథ్ సాథ్ అంటూ) భారత్-అమెరికా ప్రతినబూనాయి. ఇరుదేశాల మధ్య బంధం దృఢమైనది, శాశ్వతమైనది, విశ్వసనీయమైనదని ఎలుగెత్తి చాటాయి. ఈ బంధానికి ఉన్న శక్తి ఇంకా పూర్తి స్థాయిలో బయటపడలేదని, ఇందుకు ఇరు దేశాలు కొత్త ఎజెండాను అవలంబించాల్సిన సమయమొచ్చిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావడానికి అవకాశం లభించిందని పేర్కొన్నారు. సోమవారం నాటి విందు కార్యక్రమంలో తొలిసారిగా కలిసిన నేతలు ఆ తర్వాత తొలిసారిగా సంయుక్తంగా ఎడిటోరియల్ కథనం రాశారు. ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఇది మంగళవారం ప్రచురితమైంది. సాంప్రదాయక లక్ష్యాలను అధిగమించి ఇరుదేశాలు కొత్త శిఖరాలను చేరుతాయన్న విశ్వాసాన్ని ఇద్దరు నేతలు ప్రకటించారు.
భారత అభివృద్ధి ఎజెండాను అమలు చేయడమే కాకుండా ప్రపంచాభివృద్ధికి చోదక శక్తిగా ఉన్న అమెరికా ఆ సామర్థ్యాన్ని నిలుపుకొనేందుకు... వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారానికి సరికొత్త ఎజెండా అవసరమన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పరం సహకరించుకుంటూ అంతర్గత భద్రతకు వీలుగా నిఘా సమాచార మార్పిడికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి తమ నాయకత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.క్షేత్ర స్థాయిలో ఈ బంధం ప్రతిఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శక్తివంతమైన భారతీయ అమెరికన్లు ఇరు దేశాల మధ్య వారధిలా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. భారత్‌లో మౌలిక సేవల కల్పనకు, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తాము చర్చిస్తామన్నారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని, దీని విజయవంతానికి అన్ని స్థాయిల్లో సహకరిస్తామని ఒబామా హామీ ఇచ్చారు. భారత్‌లో అమెరికా పెట్టుబడుల వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూరుతుందని మోదీ, ఒబామా అభిప్రాయపడ్డారు.
చలే సాథ్ సాథ్...
Published Wed, Oct 1 2014 2:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement