సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని భూస్వాములైన పాటేదార్ లేదా పటేళ్లను మళ్లీ మంచి చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ మంగళవారం నుంచి భారీ ఎత్తున కసరత్తు చేపట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రంగంలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హార్ధిక్ పటేల్ ఆధ్వర్యంలో పటేల్ కమ్యూనిటీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన నేపథ్యంలో వారు పాలకపక్ష బీజేపీకి బాగా దూరమైన విషయం తెల్సిందే. అయితే ఈ కార్యక్రమానికి మాస్టర్ పార్టీ వ్యూహకర్తగా పేరు మోసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ దూరంగా ఉండనున్నారు.
ఎన్నికలకు ముందు పటేళ్లను మళ్లీ పార్టీలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రేపు, అంటే సెప్టెంబర్ 26వ తేదీన ఎంపిక చేసిన పటేల్ నాయకులతో గాంధీనగర్‌లో చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హార్ధిక్ పటేల్‌ను పిలవక పోవడం గమనార్హం. అనంతరం రాష్ట్రంలో నిర్వహించనున్న రెండు ర్యాలీలకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ రెండు ర్యాలీలకు డిప్యూటి ముఖ్యమంత్రి నితిన్ పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితూభాయ్ వఘానీలు నాయకత్వం వహించనున్నారు. వీరిరువురు కూడా పటేల్ నాయకులే.
మొదటి యాత్ర సర్ధార్ పటేల్ జన్మస్థలమైన కరమ్‌సద్ నుంచి అక్టోబర్ ఒకటవ తేదీన, రెండవ యాత్ర అక్టోబర్ రెండవ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్‌బందర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెండు యాత్రలు కూడా పటేళ్లు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల గుండా సాగి అక్టోబర్ 15వ తేదీన ముగుస్తాయి. మంగళవారం గాంధీనగర్‌లో జరుగనున్న పటేళ్ల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపాని కూడా హాజరవుతున్నారు. వివిధ సామాజిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న పటేళ్ల కమ్యూనిటీ నాయకులు దాదాపు వందమంది రేపటి సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు.
2016, సెప్టెంబర్ నెలలోనే పటేల్ కమ్యూనిటీని మళ్లీ హక్కున చేర్చుకునేందుకు సూరత్‌లో బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాటి సమావేశంలో ప్రధాన వక్తగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ఆరోజున అమిత్ షాకు వ్యతిరేకంగా పాటిదార్ యువత సమావేశంలో విధ్వంసం సష్టించి వేదికపైకి కుర్చీలు విసిరారు. షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అమృత్సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో మారణకాండ సృష్టించిన బ్రిటిష్ సైనికాధికారి జనరల్ డయ్యర్‌తో ఆయన్ని పోల్చారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన గత మార్చి నెలలో అహ్మదాబాద్ నుంచి సోమ్‌నాథ్ వెళుతుండగా పటేళ్లు ఆయనపై కోడి గుడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆనంది బెన్ పటేల్‌ను తొలగించి ఆమె స్థానంలో అమిత్ షా విధేయుడైన విజయ్ రుపానిని నియమించారు. ఈ పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే పటేళ్ల సమీకరణ కార్యక్రమానికి అమిత్ షా దూరంగా ఉన్నారు.