
వ్యూహాత్మకంగా అఖిలేశ్‌పై రాహుల్‌తో మోదీ ఎటాక్
మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన కూటమిపై దాడి చేశారు. గతంలో ఆయన చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రస్తుం అఖిలేశ్‌తో భాగస్వామ్యం పంచుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉపయోగించుకున్నారు. గతంలో అఖిలేశ్ మాటలను ఉటంకిస్తూ ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉందో లేదో తెలుసుకునేందుకు వైర్లను పట్టుకోమని అఖిలేశ్ యాదవ్ నాకు చెప్పారు. ఈ సందర్భంగా నేను ఆయనకు తన కొత్త స్నేహితుడు రాహుల్‌గాంధీ గత ఏడాది నిర్వహించిన ఖాట్ సభలో చెప్పిన మాటలు గుర్తు చేయాలని అనుకుంటున్నాను.
27 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ లైన్లు ఉన్నాయి. కానీ అందులో విద్యుత్ లేదు అని రాహుల్ అన్నాడు. ఆ విషయం అఖిలేశ్ మర్చిపోయాడేమో’ అంటూ తనదైన శైలిలో రాహుల్‌ను, అఖిలేశ్‌ను ఇరుకున పడేశారు. ‘ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రెండు పెద్ద వంతెనలు మిర్జాపూర్‌లో నిర్మిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆపని పూర్తి కాలేదు. ఇప్పటికే ఆ హామీ ఇచ్చి 13 ఏళ్లు అయినా తన తండ్రి ఇచ్చిన హామీని ఎందుకు అఖిలేశ్ నెరవేర్చలేదు. పర్యాటకానికి ఉత్తరప్రదేశ్ ఎంతో అనుకూలమైనది. కాశీకి వింద్యాచల్ ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. దేశంలో ఉన్నవారందరినీ ఇక్కడికి ఆకర్షించవచ్చు’ అని మోదీ చెప్పారు.