
‘మోదీ వృద్ధుడవుతున్నారు.. యువనేత కావాలి’
లక్నో: మరో ఐదు రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా సోమవారం ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీ, ఎస్పీ కూటమి, బీఎస్పీలో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ తన స్వరాన్ని పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీపై గట్టి విసుర్లు విసిరారు. మోదీ పెద్దవారిగా(వృద్ధుడిగా) మారి పోతున్నారని, అందుకే ఉత్తరప్రదేశ్‌కు యువనేతనే పాలకుడిగా తెచ్చుకుందామంటూ వ్యాఖ్యానించారు.
తానే మొత్తం చేశానని మోదీ చెప్పుకుంటారని, ఇస్రో రాకెట్ పంపించినా దానికి కూడా తానే కారణమని చెప్పుకుంటారని మండిపడ్డారు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ను మాత్రం ఇక్కడే ఉంచి ఆయనే వెళ్లి ఒబామాతో మాట్లాడి వస్తారని విమర్శించారు. మోదీ చెప్పిన అచ్చేదిన్ అనే సినిమా అట్టర్ ప్లాఫ్ అయిందని, ఇక చూద్దామని అనుకున్న ఈ చిత్రం కనిపించబోదని ఎద్దేవా చేశారు. విజయ్ మాల్యాకు మోదీ రూ.1200కోట్లు ఇచ్చారని, ఆయన వాటితో విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉటంకిస్తూ ప్రజల సొమ్ము మొత్తాన్ని మోదీ లాక్కున్నారని, ఆ మొత్తాన్ని కూడా కేవలం 50మంది కుబేరులకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.
ఎట్టి పరిస్థితుల్లో మోదీకి, ఆయన పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని, తమకే పూర్తి స్థాయి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. అంతకుముందు, అమిత్ షా మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది రూ.కోట్లు పంపించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు చేయడం లేదని, పైగా కొన్నింటిని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి యువకుడికి కులాలు, మతాలు అనే తారతమ్యం చూడకుండా ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మాత్రం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచిపరిపాలన అందించగలదని అన్నారు.