ఇది యువ ఆవిష్కర్తల యుగం | PM Narendra Modi's speech on smart india hackathon | Sakshi
Sakshi News home page

ఇది యువ ఆవిష్కర్తల యుగం

Published Sun, Apr 2 2017 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఇది యువ ఆవిష్కర్తల యుగం - Sakshi

ఇది యువ ఆవిష్కర్తల యుగం

స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం  

- యువతలో అసాధారణ శక్తి, సామర్థ్యాలున్నాయి
- సమస్యల పరిష్కారంలో సాంకేతిక వినియోగం పెరగాలి
- అపజయాలకు తలొగ్గకుండా యువత ముందుకు సాగాలి
- యువతలోని ఉత్సాహం, కఠోర శ్రమ నవభారతానికి బలం


వినూత్న అంశాల్ని అర్థం చేసుకునేటప్పుడు నాణ్యత ముఖ్యమని తెలుసుకోవాలి. మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి. దేశ సమస్యలకు పరిష్కారం చూపాలని భారతీయ యువత ఆశిస్తోంది.     
– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సమాజం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారానికి సాంకేతికతను విరివిగా వినియోగించాలని, అందుకోసం యువ ఆవిష్కర్తలు అత్యుత్తమ పరిష్కారాలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ కోరారు. భారతీయ యువతలో అసాధారణ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, అవి దేశానికి అత్యుత్తమ ఫలితాల్ని అందిస్తాయని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’లో భాగంగా శనివారం రాత్రి 10 వేల మంది విద్యార్థుల్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రసంగించారు.  

కలిసికట్టుగా సమస్యల్ని ఎదుర్కోవాలి..
‘ప్రస్తుతం సాంకేతిక యుగంలో నివసిస్తున్నాం. సాంకేతికతను మరింత ఎక్కువగా, వినూత్నంగా ఉపయోగించుకోవాలి. దేశాన్ని ప్రభావితం చేస్తున్న సమస్యల్ని కలిసికట్టుగా పరిష్కరించవచ్చు. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య సారాంశం. యువత పరిష్కరించాల్సిన అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. అవి సవాలుతో కూడినవైనా.. దాన్ని ఒక అవకాశంగా భావించాలి.  సమస్య పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌లో నా యువ స్నేహితులు చేస్తున్న ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇస్తాయని నేను నమ్మకంతో ఉన్నాను.  

నాణ్యత ముఖ్యం
యువత కొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురైనా ధైర్యం, స్ఫూర్తి తగ్గకుండా చూసుకోవాలని ప్రధాని సూచించారు. ‘వినూత్న అంశాల్ని అర్థం చేసుకునేటప్పుడు నాణ్యత ముఖ్యమని తెలుసుకోవాలి. మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి. దేశ సమస్యలకు పరిష్కారం చూపాలని భారతీయ యువత ఆశిస్తోంది. నేటి యువత తరచూ అనేక ప్రశ్నలు అడుగుతుందని ప్రజలు చెపుతుంటారు. యువతలో జిజ్ఞాస ప్రశంసించదగ్గ విషయం’ అని అన్నారు.  

నవభారతం కోసం శ్రమించాలి
యువతలోని కఠోర శ్రమ, ఉత్సాహం, నవభారతానికి బలాన్నిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమ సమరం కోసం ఏదోఒకటి చేయాలని అప్పటి ప్రజలు తరచూ ఆలోచించేవారని, ప్రజలు నవభారతం కోసం కలలు కనాలని, ఆ దిశగా శ్రమించాలని ఆకాంక్షించారు. యువత తమ శక్తిని పరిపాలన రంగంపై కేంద్రీకరిస్తే, అనేక సానుకూల ఫలితాలు వస్తాయన్నారు.  

ఆలోచనల్ని ప్రధానితో పంచుకున్న విద్యార్థులు
వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు విద్యార్థులు తమ ఆలోచనలు, పరిష్కారాల్ని మోదీతో పంచుకున్నారు. ఆటోమొబైల్స్‌ బరువుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని రాయ్‌పూర్‌కు చెందిన విద్యార్థి ప్రస్తావించగా.. జాతీయ రహదారులపై అంబులెన్స్‌ సేవల కోసం ఓలా, ఉబర్‌ తరహాలో యాప్‌ రూపొందించవచ్చని మరో విద్యారి అన్నా డు.   గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చు/ఉచిత శానిటరీ చేతి గుడ్డలను ఇవ్వాలని ఓ విద్యార్థిని సూచించింది. ఇం జనీరింగ్‌ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసేలా విధానాన్ని రూపొందిస్తే బాగుంటుందని మరొకరన్నారు.

హ్యాకథాన్‌ ప్రారంభం
యువతలోని ప్రతిభను వెలికితీసి, వారు రూపొందించిన ఆవిష్కరణల్ని సామాజిక సమస్యల పరిష్కారానికి వినియోగించే లక్ష్యంతో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ నోయిడాలో శనివారం ప్రారంభమైంది. హ్యకథాన్‌ ఫైనల్లో 10 వేల మంది పాల్గొంటున్నారు.  దేశవ్యాప్తంగా 26 ప్రదేశాల్లో ఫైనల్‌ను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హ్యాకథాన్‌ ఆదివారం రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. నాస్కాం, ఇతరసంస్థలసాయంతో మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని ఏఐసీటీఈ దీన్ని నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమం కోసం 29 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు మొత్తం 598 సమస్యల్ని గుర్తించారు. ఫైనల్‌ కోసం 28 రాష్ట్రాల నుంచి మొత్తం 1266 బృందాలకు చెందిన 10 వేల మందిని ఎంపిక చేశారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2017 ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ.. సాంకేతికతకు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందనేందుకు హ్యాకథాన్‌లో పాల్గొంటున్న వారి సంఖ్యే నిదర్శనమన్నారు. విద్యార్థుల విజ్ఞానాన్ని నిజ జీవితానికి ఎలా అన్వయించాలో తెలియచేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement