బ్యాంకుకు వచ్చిన ప్రధాని మోదీ తల్లి
గాంధీనగర్: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో చిన్నపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాంకులు, పోస్టాపీసుల వద్ద బారులు తీరుతుండగా గుజరాత్ లోని ఓ బ్యాంకు ముందు ఓ పెద్దావిడ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. మీడియా మొత్తం ఒక్కసారిగా ఆమె వైపు తమ కెమెరాలు తిప్పింది. ఆమె ఎవరో కాదు భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరా బెన్. ఆమె మంగళవారం ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ బ్యాంకు వద్దకు తన సహాయకుల సాయంతో చేరుకున్నారు.
అనంతరం వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్దకు వెళ్లి తన పాత డబ్బును మార్పిడి చేసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు ఇక చెల్లబోవని ఈ నెల(నవంబర్) 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారి దేశంలోని పలువురు(వీరిలో సామాన్యులే అధికం) బ్యాంకులముందు తమ కనీస అవసరాలకోసం బారులు తీరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.