
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌లో కుమార్తెకు ఖాతా ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన 73 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించారు. తన కుమార్తె కుటుంబానికి సంబంధించి రూ 2.25 కోట్ల నిధులు పీఎంసీ బ్యాంక్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై షోలాపూర్‌లో భారతి సదరంగని అనే వృద్ధురాలు మరణించారు. గత రెండు నెలలుగా ఆమె తమకు ప్రతిరోజూ ఫోన్ చేసి బ్యాంక్‌లో తమ డిపాజిట్ల పరిస్థితి ఏమిటని వాకబు చేసేవారని, తమ డబ్బు సురక్షితంగా ఉందని తాము చెప్పినా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారని బాధితురాలి అల్లుడు చందన్ చెప్పారు.
ఒత్తిడికి గురైన తమ అత్త హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ కష్టపడి సంపాదించిన మొత్తాన్ని ఈ బ్యాంక్‌లో దాచామని చెప్పారు. ముంబైలోని ములుంద్‌లో తమ ఇంటికి ఎదురుగా ఉన్న పీఎంసీ బ్యాంక్‌లో తమ నిధులను డిపాజిట్ చేశామని, బ్యాంక్ సేవలు కూడా సంతృప్తికరంగా ఉండేవని అనూహ్యంగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చందన్ ఆందోళన చెందారు. భారతి సదనందన్ మృతితో ఈ కుటుంబం తీవ్ర దిగ్ర్భాంతికి లోనైంది.
Comments
Please login to add a commentAdd a comment