వాతావరణ విభాగంపై పోలీసు కేసు
► వర్షాలు వస్తాయంటూ తప్పుదోవ పట్టించిందని రైతుల ఫిర్యాదు
► విత్తన, ఎరువులకంపెనీలతో కలసి మోసం చేసిందని ఆరోపణ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక. అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యవసాయానికి వర్షం ఆయువుపట్టు లాంటిది. మరి ఆ వర్షం రాకడ గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా భారత వాతావరణ విభాగాన్ని(ఐఎండీ) ఆశ్రయించాలి. ఒకసారి వర్షాలు వస్తాయని ఐఎండీ ప్రకటించాక వానలు కురవక పోతే ఏమి చేయాలి? దీనికి బాధ్యుల్ని చేస్తూ ఐఎండీపై ఫిర్యాదు చేయాలా? సరిగ్గా అదే చేశారు మహారాష్ట్రలోని మరఠ్వాడ రైతులు.
వాతావరణాన్ని తప్పుగా అంచనా వేసినందుకు శుక్రవారం బీడ్ జిల్లా మజల్గావ్ తాలుకాలోని డిండ్రుడ్ పోలీసు స్టేషన్‌లో ఐఎండీపై రైతులు ఫిర్యాదు చేశారు. విత్తన, ఎరువుల తయారీదారులతో పూణే, కొలబా వాతావరణ విభాగం కుమ్మక్కై ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు పుష్కలంగా కురుస్తాయని ప్రకటించినట్లు రైతులు ఫర్యాదిచ్చారు. వర్షాలు వస్తాయంటూ రైతులను ఐఎండీ తప్పుదోవ పట్టించిందని ఆనంద్‌గావ్ గ్రామానికి చెందిన రైతు గంగాభిషేకం తవార్ (54) ఆరోపించారు. ఐఎండీ మాట విని తమ ప్రాంతంలో జూన్ నెలకు ముందే విత్తనాలు వేశామని, ఎంతో ఖర్చుపెట్టి ఎరువులు, పురుగుమందులు కొన్నామని, కూలీలకు జీతాలు చెల్లించామని తెలిపారు.
కానీ ఇప్పటికీ వర్షాలు రాలేదని దీంతో లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రైతులు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో రైతులు కోరారు. కాగా, రైతుల ఫిర్యాదును స్వీకరించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని మజల్గావ్ పోలీసులు తెలిపారు. దీనిపై వాతావరణ విభాగం ప్రకటన చేయకపోవడం గమనార్హం.