రాయపూర్ః ఓ పోలీస్ జవాన్ తన సర్వీస్ వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. కుకనార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న 32 ఏళ్ళ కానిస్టేబుల్ ధీరేంద్ర కాంత్.. తాను పని చేస్తున్న స్టేషన్ కు దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్ లో సర్వీస్ రైఫిల్ తో షూట్ చేసుకొని తనువు చాలించినట్లు సుక్మా సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ ఇంద్రా కల్యాణ్ తెలిపారు. కాంత్ రూమ్ నుంచి తుపాకీ శబ్దం వినిపించడంతో వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీసిన తోటి సిబ్బంది.. అతడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారని... వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా కాంత్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించినట్లు ఎస్పీ తెలిపారు.
జంజ్గిర్ చంపా జిల్లా పామ్ఘర్ కు చెందిన కాంత్ కు కొన్ని నెలల క్రితం కాలు విరగడంతో అతడిని సుక్మా లోని గొలాపల్లి పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అనంతరం అతడి కోరికమేరకు ఇటీవలే జగదల్ పూర్ కు దగ్గరలోని కుకనార్ కు బదిలీ చేసినట్లు ఎప్పీ తెలిపారు. అయితే సెలవు అనంతరం సెప్టెంబర్ 16న కాంత్ విధుల్లో చేరారని, ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని ఎస్పీ తెలిపారు. కానిస్టేబుల్ ఇటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేమిటన్నది తెలియాల్సి ఉందన్నారు. కాంత్ ఆత్మ హత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపామని, అతడి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ ఇంద్రా కల్యాణ్ పేర్కొన్నారు.
పోలీస్ జవాన్ ఆత్మహత్య..
Published Tue, Sep 20 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement