తుపాకీతో కాల్చుకున్న ఎస్‌ఐ..  | SI Commits Suicide by Shooting himself in Chennai | Sakshi
Sakshi News home page

మరో బలవన్మరణం!

Published Thu, Mar 8 2018 8:33 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

SI Commits Suicide by Shooting himself in Chennai - Sakshi

ఇన్‌సెట్లో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌

సాక్షి, చెన్నై: పోలీసు యంత్రాంగాన్ని కలవరం పెట్టే మరో ఘటన బుధవారం చెన్నైలో చోటుచేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పనిభారంతో బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మ జయలలిత సమాధి సాక్షిగా ఆదివారం ఆయుధ బలగాల విభాగానికి చెందిన కానిస్టేబుల్‌ అరుణ్‌రాజ్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్ని కలవరంలో పడేసింది.  

ఈ ఘటన మరవకముందే బుధవారం ఉదయాన్నే పోలీస్‌స్టేషన్లోనే ఎస్‌ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం మరింతగా కలవరంలో పడేసింది. తంజావూరు జిల్లా తిరువిడై మరుదురుకు చెందిన రాజారాం, అభింక దంపతులకు సతీష్‌కుమార్‌ (33), గణేష్‌కుమార్, సెల్వకుమార్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

వీరిలో సతీష్‌కుమార్‌ 2011లో ఎస్‌ఐ శిక్షణకు ఎంపికయ్యారు. శిక్షణ కాలం ముగియడంతో 2014లో ఐనావరం లా అండ్‌ ఆర్డర్‌ విభాగం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అదే స్టేషన్లో పనిచేస్తూ వస్తున్నారు. సతీష్‌కుమార్‌ అంటే ఐనావరంలో రౌడీలకు సింహస్వప్నంగా చెప్పవచ్చు. సామాన్యులకు తన వంతు సేవల్ని అందించడంలోనూ ఆయన ముందుంటారని అక్కడి వారు కొనియాడుతూ ఉంటారు. వి«ధి నిర్వహణలో నిక్కచ్చితనంగా ఉంటూ, సెలవులు లేకుండా రేయింబవళ్లు శ్రమిస్తూ వచ్చిన సతీష్‌కుమార్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది.

తుపాకీతో కాల్చుకుని..
 సతీష్‌కుమార్‌ చెన్నై టీపీ చత్రం పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఐనావరం స్టేషన్లో మొత్తం ఆరుగురు ఎస్‌ఐలు ఉండగా, ఇందులో సతీష్‌కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సతీష్‌ ఆత్మహత్యకు పాల్పడే ముందుగా టెన్షన్‌ టెన్షన్‌గా ఉండడం, తుపాకీతో కాల్చుకునేందుకు ముందుగా జరిగిన ఘటన వివరాలను కానిస్టేబుల్‌ చిరంజీవి ఉన్నతాధికారులకు వివరించారు. మంగళవారం విధుల్ని ముగించుకుని పది గంటలకు క్వార్టర్స్‌కు వెళ్లారు. 

అక్కడి నుంచి కొన్ని నిమిషాల్లో మళ్లీ స్టేషన్‌కు ఆయన వచ్చారు. స్టేషన్లో ఉన్న చిరంజీవిని పలకరిస్తూ తుపాకీ కావాలని, నైట్‌ రౌండ్స్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో తుపాకీ ఉన్న బాక్సు తాళాల్ని సతీష్‌కు చిరంజీవి అందించారు. ఆ బాక్సులో తన తుపాకీని తీసుకున్న సతీష్‌ టెన్షన్‌ టెన్షన్‌గా ఉండడంతో ఏమైనట్టు చిరంజీవి ప్రశ్నించాడు. ఈ ఉద్యోగం చేయడం కన్నా, చావడం మంచిదన్నట్టు తన సీట్లోకి సతీష్‌ వెళ్లారు. వెళ్తూ ఓ తెల్ల పేపరును సైతం తీసుకెళ్లారు.  కాసేపటికి ఆయన తుపాకీని తల భాగం వద్ద పెట్టుకుని ఉండడాన్ని చిరంజీవి గుర్తించారు. 

ఏమైందంటూ మళ్లీ, మళ్లీ ప్రశ్నించగా, చావడమే మంచిదయ్యా, టార్చర్‌ మరీ ఎక్కువగా ఉందంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్లే యత్నం చేశారు. ఆయన్ను వారించేందుకు చిరంజీవి ప్రయత్నించి విఫలం అయ్యారు. సతీష్‌ టెన్షన్‌గా ఉండడాన్ని గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించేందుకు చిరంజీవి ప్రయత్నించారు. ఇంతలో బయటకు వెళ్తూ, తుపాకీతో కాల్చుకుని  స్టేషన్‌ గుమ్మం వద్దే సతీష్‌కుమార్‌ 
కుప్పకూలి సతీష్‌ విగతజీవిగా మారాడు. 

పని భారమే కారణమా:  సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. సతీష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు ఐనావరంలో సతీష్‌కుమార్‌ పనితీరును మెచ్చుకునే జనం తరలి వచ్చి నివాళులర్పించడం గమనార్హం. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. 

గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. సతీష్‌కుమార్‌ మరణంపై ఆయన తండ్రి రాజారాం పేర్కొంటూ పని భారం ఎక్కువగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదే స్టేషన్‌కు బాస్‌గా ఉన్న ఉన్నతాధికారి వేధింపులు ఐనావరంలో మరీ ఎక్కువేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన గతంలో ఓ స్టేషన్‌లో ఉండగా ఓ సిబ్బంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరో మహిళా సిబ్బంది ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు వాట్సాప్‌ వీడియో ద్వారా కలకలం రేపారు. 

ఈ సమయంలో ఆ బాసు నేతృత్వంలోని స్టేషన్‌లో ఉన్న సతీష్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్ప డడం అనుమానాలకు దారి తీసింది. సతీష్‌కుమార్‌ సీట్లో లభించిన సూసైడ్‌ నోటల్‌లో తన మరణానికి కారుకులెవ్వరూ లేరని పేర్కొని ఉండడం గమనార్హం. సతీష్‌కుమార్‌ మరణం తదుపరి కాసేపటికి భారతి అనే  ఓ మహిళా  కానిస్టేబుల్‌  పని భారం మరీ ఎక్కువగా ఉంది, ఈ ఉద్యోగం చేయడం కన్నా, రాజీనామా చేసి కూలీ పని చేసుకోవచ్చంటూ వాట్సాప్‌ వీడియో ద్వారా పోలీసు యంత్రాంగంలో గుబులు రేకెత్తించే వ్యాఖ్యల్ని చేశారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement