గ్యాంగ్ రేప్, హత్య.. ఇద్దరు పోలీసులు సస్పెండ్
సోనిపట్: యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించి హర్యానాలో చోటుచేసుకున్న మరో ఘటనలో ఇద్దరు పోలీసులు సస్పెండ్ కాగా, మరో పోలీసును బదిలీ చేశారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో గత వారం ఓ మహిళ (23)పై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికివేసిన విషయం విదితమే. ఈ పాశవిక ఘటనపై హర్యానా డీజీపీ బీఎస్ సంధు పోలీసు ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష జరిపారు.
గ్యాంగ్ రేప్ కేసు విచారణలో జాప్యం చేస్తూ అలసత్వం ప్రదరిస్తున్నారని ఆగ్రహించిన డీజీపీ సోనిపట్ ఎస్పీని, ఏఎస్ఐ జోగిందర్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సోనిపట్ ఎస్‌హెచ్‌వో అజయ్‌ని సోనిపట్ పోలీస్ లైన్స్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. రోహ్‌తక్ ఎస్పీ అశ్విన్ శెన్వీపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఈ కేసులో ఇద్దరు నిందితులు సుమీత్, వికాస్‌లను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచిన అనంతరం ఇద్దరినీ వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించారు. మే 22న నిందితులను సోనిపట్ జిల్లా కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.