సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) హింసపై కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న (ఆదివారం) వర్సిటీలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే సృష్టించింది. తమపై ఏబీవీపీకి చెందిన వారు దాడి చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించగా.. వారే తమపై దాడికి దిగారని ఏబీవీపీ ప్రతి ఆరోపణలకు దిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం దాడిలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలను విడుదల చేశారు. దీనిలో జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్‌తో పాటు తొమ్మిది మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
సీసీ కెమెరా పుటేజీ అధారంగా విచారణ జరుపుతున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. దాడికి పాల్పడింది వారేనని విచారణలో రుజువైతే చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. కాగా పోలీసులు విడుదల చేసిన జాబితాపై అయిషీ ఘోష్ స్పందించారు. అది ఇతరులు ఎంపిక చేసిన విద్యార్థులు జాబితా అని కొట్టిపారేశారు. చట్టానికి విరుద్ధంగా తామేమీ తప్పుచేయలేదని ఆమె అన్నారు. ఢిల్లీ పోలీసులు సరైన రీతిలో విచారణ జరపాలని ఆమె కోరారు. అయితే అదే రోజు జరిగిన దాడిలో ముసుగులో వచ్చిన దుండుగులు ఆయిషీ ఘోష్‌తో పాటు పలువురు విద్యార్థిలను చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఘోష్ నాయకత్వాన క్యాంపస్‌లోని సర్వర్ రూమ్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఆదివారం రాత్రే ఢిల్లీ పోలీసులు వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment