సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 73.5 శాతం పోలింగ్ నమోదయిందని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. పోలింగ్ సజావుగా సాగడానికి వీలుగా 37,605 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 17,850 మంది పోలీసులు, హోంగార్డులు, 65 కంపెనీల పారామిలటరీ బలగాలను వినియోగించామన్నారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో సాంకేతిక కారణాలతో 297 వీవీపీఏటీ ఓటింగ్ యంత్రాలను మార్చినట్లు తెలిపారు.
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తామన్నారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ రామ్‌పూర్‌లో, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్ సమీర్‌పూర్‌ల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 50,000 మంది టిబెటన్లు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. 1950–87 మధ్యకాలంలో భారత్‌లో జన్మించిన వీరంతా 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓటు హక్కును పొందారు. దేశంలోనే తొలి ఓటరైన శ్యామ్ శరణ్ నేగీ(101) కిన్నౌర్ జిల్లాలోని కల్పాలో 15వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు మొత్తం 68 సీట్లకు పోటీ పడుతుండగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) 42 చోట్ల, సీపీఎం 14 చోట్ల, స్వాభిమాన్ పార్టీ, లోక్ ఘడ్బంధన్ పార్టీ చెరో ఆరు స్థానాల్లో, సీపీఐ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, వీరిలో 19 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment