ఆగని జన విస్ఫోటం
నేడు జనాభా దినోత్సవం
ఫలితమివ్వని పథకాలు
మౌలిక వసతులపై పెనుభారం
న్యూఢిల్లీ: మహా నగరాల్లోని మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే మనదేశంలో జనాభా ఉధృతి ఎంత భారీగా ఉందో సులువుగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శనివారం జనాభా దినోత్సవాన్ని పాటిస్తున్న నేపథ్యంలో.. జాతీయస్థాయిలో అందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందజేయడానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించడం విధానకర్తల ఎదుట ఉన్న ప్రధాన విధి. భారత్‌లో 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121.2 కోట్లు. ప్రస్తుతం జనాభా విషయంలో అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ 2025 నాటికి అధిగమిస్తుందని భావిస్తున్నారు. పదుల సంఖ్యలో జనాభా నియంత్రణ, సామాజిక సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేసినా, ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. అత్యాధునిక వైద్యవిధానాల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య చాలా వరకు తగ్గినా, జననరేటు మాత్రం తగ్గడం లేదు.
పేదల్లోనే జనాభా ఎక్కువ..
పేద కుటుంబాల్లోనే జనాభా అధికమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేమే ఇందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. భారత్‌లోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల కుటుంబాల్లో సంతానసాఫల్య రేటు 2.1గా ఉన్నట్టు 2009లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని జనాభా ప్రమాణాలతో చూస్తే ఇది చాలా ఎక్కువ. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక జంట-ఒక సంతానం’ విధానం మానవ హక్కులకు వ్యతిరేకమనే విమర్శలున్నా, అక్కడ జన విస్ఫోటాన్ని నియంత్రించడంలో ఈ పద్ధతి విజయవంతమైంది. భారత్‌లో జననాల సంఖ్య నిరోధానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, మన జనాభా త్వరలోనే 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంత మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తాయన్నది చాలా విలువైన ప్రశ్న.
నిపుణులు చేస్తున్న ముఖ్య సిఫార్సులు
1.మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపడం
2.గర్భనిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడం
3.లైంగిక విద్యకు ప్రాధాన్యం పెంచడం
4.పురుషులకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లను ప్రోత్సహించడం
5.తొలి కాన్పునకు మలికాన్పునకు మధ్య వ్యవధి పెంచడం
6.పేదలకు కండోమ్‌ల వంటి గర్భనిరోధక సాధనాలను నిస్సంకోచంగా పంచాలి
7.వైద్యరంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి.
డాక్టర్లు కరువు
గత రెండు సంవత్సరాల్లో కొత్తగా 7,500 ప్రైవేటు ఆస్పత్రులు, మూడు లక్షల మంది డాలర్లు అందుబాటులోకి వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన మందుల దుకాణాల వల్ల గ్రామస్థాయిల్లోనూ సాధారణ మందులతోపాటు గర్భనిరోధక సాధనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే జనాభా అసాధారణ రీతిలో పెరుగుతుండడంతో రోగులకు సరిపడినంత మంది డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉందని ఢిల్లీ యశోదా హాస్పిటల్ డాక్టర్ రజత్ అరోరా అన్నారు. అట్టడుగు స్థాయిలోనూ నాణ్యమైన వైద్యం అందించే వ్యూహాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు.