'జన' గణనీయం | The Rate Of Population Growth Is Increasing In Guntur District | Sakshi
Sakshi News home page

'జన' గణనీయం

Published Thu, Jul 11 2019 8:55 AM | Last Updated on Thu, Jul 11 2019 8:55 AM

The Rate Of Population Growth Is Increasing In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు:  దేశాభివృద్ధి జనాభా ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే మరికొన్ని జనాభా లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పెరుగుతూ ఉంది. 2001లో జిల్లా జనాభా 44,65,144 ఉండగా 2011లో 48,87,813కు పెరిగింది. ప్రస్తుతం 2019 నాటికి జిల్లా జనాభా 52,54,570కు చేరుకుంది. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు.

ఐదేళ్లలో పెరుగుతూ వస్తున్న జనాభా..
2001లో పురుషులు 22,50,279 మంది ఉండగా స్త్రీలు 22,14,865 మంది ఉన్నారు. 2011లో 24,40,521 మంది పురుషులు ఉండగా 24,47,292 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా పెరుగుదల రేటు 8.72 శాతం ఉండగా 2011 నాటికి 9.47కు పెరిగింది.  గ్రామీణ ప్రాంతాల్లో 2011లో జనాభా (66.19శాతం ) 32,35,075 మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో (33.81శాతం) 16,52,738 మంది ఉన్నారు.  2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష జనాభా దాటిన నగరాల జాబితాలో చిలుకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, గుంటూరు ఉన్నాయి.  జిల్లాలో జనసాంద్రత ఉన్న గ్రామాలు 691 ఉండగా  గుంటూరు, నరసరావుపేట పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది. 2014–15లో 50,22,250 మంది జనాభా జిల్లాలో ఉన్నారు. 2015–16లో 50,67,879 మంది, 2016–17లో 51,13,922 మంది, 2017–18లో 51,60,384 మంది, 2018–19లో 52,07,268 మంది జిల్లాలో జనాభా ఉన్నారు.

గతంలో ఆరుసార్లు రాష్ట్ర అవార్డులు..
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచి ఆరుసార్లు వరుసగా రాష్ట్ర అవార్డులు అందుకుని డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించింది. డాక్టర్‌ మీరావత్‌ గోపీనాయక్‌ ఆధ్వర్యంలో   2009–10లో తొలిసారిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఈ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడిన 50 ఏళ్లలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు  అవార్డు రావటం ఇదే ప్రథమం.  నాటి నుంచి వరుసగా 2010–11లో,  2011–12లో, 2012–13లో, 2013–14లో, 2015–16లో  వరుసగా అవార్డు పొంది ఇప్పటివరకు ఏ జిల్లా కూడా సాధించని డబుల్‌ హ్యాట్రిక్‌  రికార్డును  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. రాష్ట్ర విభజన నాటి నుంచి జనాభా నియంత్రణ అవార్డులను టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది.

ఉచితంగా ఆపరేషన్లు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. పెళ్ళైన వెంటనే గర్భం రాకుండా నిరో«ధ్‌లు వినియోగించేలా ప్రోత్సహించటం, నోటి మాత్రలు మింగటం ద్వారా త్వరగా గర్భం రాకుండా నిలువరించటం వంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజలు పాటించేలా వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే స్త్రీలకు రూ.600, పురుషులకు రూ.1,100 ప్రోత్సాహకంగా ఇస్తున్నాం.
                                           - డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

ప్రతినెలా 200 కు.ని ఆపరేషన్లు
గుంటూరు జీజీహెచ్‌ కుటుంబ నియంత్రణ విభాగంలో ప్రతినెలా 200 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం. జిల్లాలో అత్యధికంగా కు.ని. ఆపరేషన్లు చేస్తున్నందుకు ప్రతి ఏడాది మా వైద్య విభాగానికి అవార్డును ఇస్తున్నారు. ఆపరేషన్‌ చేసేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆపరేషన్‌ చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కేవలం పదిరోజులపాటు బరువులు ఎత్తకుండా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. 
                                              - డాక్టర్‌ మండవ శ్రీనివాసరావు, జీజీహెచ్‌ కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్‌  ఆఫీసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement