సాక్షి,న్యూఢిల్లీ: అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వేతనాలు ఉన్నతాధికారులు, త్రివిధ దళాధిపతుల వేతనాలతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలుతో ఉన్నతోద్యోగుల వేతనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినా త్రివిధ దళాలకు చీఫ్‌గా వ్యవహరించే రాష్ట్రపతి మాత్రం వాయు, సైనిక, నౌకా దళ చీఫ్‌ల కంటే తక్కువ వేతనంతో సరిపెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ 1.50 లక్షలు కాగా, ఉపరాష్ట్రపతి రూ 1.25 లక్షల వేతనం అందుకుంటున్నారు. ఏడవ వేతన కమిషన్ అమలుతో క్యాబినెట్ కార్యదర్శికి రూ 2.5 లక్షల వేతనం కాగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రూ 2.25 లక్షల వేతనం అందుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలు కేబినెట్ సెక్రటేరియట్ వద్ద ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇంకా కేంద్ర కేబినెట్ ఆమోదానికి నోచుకోలేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. హోంశాఖ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రపతి వేతనం రూ 5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనం రూ 3.5 లక్షలకు, గవర్నర్ల వేతనం రూ 3 లక్షలకు పెరగనుంది.
గతంలో 2008లో పార్లమెంట్ ఆమోదించిన మేరకు వీరి వేతనం మూడు రెట్లు పెరిగింది. అప్పటివరకూ రాష్ట్రపతి వేతనం రూ 50,000, ఉపరాష్ట్రపతి వేతనం రూ 40,000, గవర్నర్ వేతనం రూ 30,000గా ఉండేది. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు వేతన పెంపుతో పాటు మాజీ రాష్ట్రపతులు, వారి జీవిత భాగస్వాములకు ఇచ్చే పెన్షన్లనూ భారీగా పెంచాలని హోంశాఖ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment