న్యూఢిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల జీతభత్యాలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఏడో వేతన సంఘం అమలుతో కేంద్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల జీతాలు.. రాష్ట్రపతి, ఉపరాష్ర్టపతుల జీతాల కంటే ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. హోం శాఖ సిద్ధంచేసిన ఈ ప్రతిపాదనలను వచ్చే వారంలో కేబినెట్ ఆమోదానికి పంపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రపతి నెలకు రూ. 1.50 లక్షలు, ఉపరాష్ట్రపతి రూ. 1.25 లక్షలు, గవర్నర్లు రూ. 1.10 లక్షలు జీతంగా అందుకుంటున్నారు.
అయితే, ఏడో వేతన సంఘం అమలుతో తాజాగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి రూ. 2.5లక్షలు, కార్యదర్శులు రూ. 2.25లక్షల జీతం పొందుతున్నారు. ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పాక ఆయా బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంది. 2008లో చివరిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచారు. 2008కి ముందు వీరి జీతాలు వరసగా రూ. 50,000, రూ. 40,000, రూ. 36,000 ఉండేవి. కాగా, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉపరాష్ట్రతులు, మాజీ గవర్నర్ల పెన్షన్ చెల్లింపులను పెంచాలనే ప్రతిపాదనలపై కేంద్రం యోచిస్తోంది.