దేశద్రోహం ఆరోపణలతో ఉపాధ్యక్షుడు అరెస్టు
మాల్ (మాల్దీవులు): మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను చంపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ అరెస్టయ్యారు. దేశద్రోహం ఆరోపణలపై అదీబ్‌ను అరెస్టుచేసి ధూనిధో జైలుకు తరలించామని అధికారులు శనివారం ట్విట్టర్‌లో తెలిపారు.
పదిరోజుల కిందట సౌదీ అరేబియా తీర్థయాత్ర నుంచి తిరిగొస్తుండగా అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రయాణిస్తున్న బోటులో బాంబు పేలింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఆయన వెంటనే రక్షణమంత్రి మూసా అలీ జలీల్‌పై వేటు వేశారు. ఇంతకుపూర్వం ఉపాధ్యక్షుడు మహమద్ జలీల్ కూడా దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన 33 ఏళ్ల అదీబ్ కూడా ప్రస్తుతం అవే ఆరోపణలతో జైలుపాలయ్యాడు.