కదనరంగంలోకి ప్రియాంక | Priyanka Gandhi roadshow In Lucknow | Sakshi
Sakshi News home page

కదనరంగంలోకి ప్రియాంక

Feb 12 2019 2:04 AM | Updated on Feb 12 2019 9:04 AM

Priyanka Gandhi roadshow In Lucknow - Sakshi

లక్నో: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మనవరాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో అశేష అభిమాన జన సందోహం మధ్య తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా గత నెలలో ఆమె నియమితులైన అనం తరం తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌కు వచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, తన అన్న రాహుల్‌ గాంధీ, యూపీ పశ్చిమ ప్రాంత పార్టీ ఇన్‌–చార్జ్‌ జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఢిల్లీ నుంచి ఆమె లక్నో చేరుకున్నారు.

వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రియాంకకు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి లక్నోలోని పార్టీ కార్యాలయం వరకు రాహుల్, ప్రియాంక, సింధియాలు కలిసి 25 కి.మీ.పాటు రోడ్‌ షో నిర్వహించారు. వీరి వాహనాలకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. దారి పొడవునా వాహనాలపై రోజా, బంతిపూలు చల్లడం సహా ఈ రోడ్‌షోకు కార్యకర్తలు ఘనంగా ఏర్పాట్లు చేశా రు. ప్రియాంకను చూసేందుకు, ఆమెను తమ ఫోన్లతో ఫొటోలు తీసేందుకు దారి పొడవునా జనం ఒకర్నొకరు తోసుకుంటూ ఎగబడ్డారు. ‘రండి. మనమందరం కలిసి కొత్త భవిష్యత్తును నిర్మిద్దాం.

కొత్త రకం రాజకీయాలు చేద్దాం. ఇంతటి అభిమానం చూపుతున్న మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ ప్రియాంక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోడ్‌ షోతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లేనని తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులు పోటీ చేసే అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాల బయట ప్రియాంక రోడ్‌ షోలు, ర్యాలీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.  

దుర్గామాతగా ప్రియాంక ఫొటో
ప్రియాంకకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. లక్నో నగరం మొత్తం పార్టీ జెండాలు, ప్రియాంక ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. సోమవారం ఉదయం నుంచే రోడ్‌ షో ఏర్పాట్లకు తుది మెరుగులు దిద్దుతూ కార్యకర్తలు బిజీగా గడిపారు. రోడ్లపై వెళ్తున్నవారికి ఆహార పొట్లాలు, టీ, మంచి నీళ్లు అందించారు. లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసి దేశ భక్తి గీతాలు పెట్టారు. కొన్ని పోస్టర్లలో ప్రియాంకను సింహంపై కూర్చోబెట్టి దుర్గా మాతతో పోల్చారు. ఆమె దేవి అవతారమని వాటిపై రాశారు. మరికొందరు తన నానమ్మ ఇందిరా గాంధీతో ప్రియాంకను పోలుస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు కార్యకర్తలు ‘ప్రియాంక సేన’ అని రాసి, ఆమె ఫొటోను ముద్రించిన గులాబీ రంగు టీ షర్టులను ధరించారు.  

మూడ్రోజులు సమావేశాలు 
మంగళ, బుధ, గురువారాల్లో ప్రియాంక, సింధియాలు లక్నోలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. యూపీసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌ బక్షి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనం పార్టీ తన పట్టును తిరిగి సాధించేందుకు ఉపకరిస్తుందనీ, కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ప్రియాకం ఆశా కిరణంగా మారారు. కాంగ్రెస్‌ పార్టీని, ప్రత్యేకించి తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో పార్టీని పునరుత్తేజం చేసే బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు మంచి పట్టుంది. 

ట్విట్టర్‌ ఖాతా తెరిచిన ప్రియాంక 
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక తన తొలి రోడ్‌ షో జరిగిన రోజునే ప్రియాంక సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌లోనూ ఖాతా తెరిచారు. ఖాతా తెరిచిన 10 గంటల్లోనే ఆమెను లక్ష మంది ఫాలో అయ్యారు. ‘ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా ఉన్నారు. ఃpటజీy్చnజ్చుజ్చnఛీజిజీ ఖాతాను మీరు అనుసరించొచ్చు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఓ ట్వీట్‌ చేసింది. ప్రియాంక తొలి రోజు ఏ ట్వీట్‌ చేయకుండా కేవలం తన అన్న రాహుల్, సింధియా, సచిన్‌ పైలట్‌ తదితర ఏడుగురిని ఆమె ఫాలో అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీకి సామాజిక మాధ్యమాల్లో భారీ ప్రచారం లభించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర ఓటమి పాలైంది. తర్వాతి కాలంలో పాఠాలు నేర్చుకుని సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది.

యూపీలో అధికారమే లక్ష్యం: రాహుల్‌
దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు ఉత్తరప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పారు. ‘దేశానికి ఉత్తరప్రదేశ్‌ గుండెలాంటిది. ఈ రాష్ట్రంలో మా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ప్రియాంక, జ్యోతిరాదిత్య విశ్రమించబోరని ప్రకటించారు. అందరికీ న్యాయం చేకూర్చే ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడమే వారి బాధ్యత’అని అన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇకపై కీలకంగా వ్యవహరించనుందని తెలిపారు. ‘మా దృష్టంతా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపైనే ఉందన్నది సుస్పష్టం. దీంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా విశ్రమించం. రైతులు, యువజనులు, పేదలకు న్యాయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. దేశంలో అవినీతి, రైతు సమస్యలు, నిరుద్యోగం.. ఇలా అనేక సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని రాహుల్‌  తెలిపారు. ‘కాపలాదారే దొంగ (చౌకీదార్‌ చోర్‌ హై) అంటూ ర్యాలీకి హాజరైన వారితో నినాదాలు చేయించారు. 

ప్రియాంక ఉత్తమ భార్య, తల్లి
ప్రియాంక గాంధీ ఉత్తమ భార్య, ఉత్తమ తల్లి అనీ, ఇప్పుడు ఆమెను తాము దేశ ప్రజలకు అప్పగిస్తున్నామని ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా అన్నారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కక్షలతో కూడిన ప్రమాదకరమైన రాజకీయ వాతావరణంలో అప్రమత్తంగా ఉండాలని ఆమెను కోరారు. పార్టీలో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రియాంక జనంలోకి వెళ్లిన సందర్భంగా వాద్రా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తూ దేశ ప్రజలకు సేవలందించబోతున్న నీకు నా అభినందనలు. నువ్వు నాకు ఉత్తమ స్నేహితురాలిగా, ఉత్తమ భార్యగా, మన పిల్లలకు ఉత్తమ తల్లిగా ఉంటున్నావు’ అని వాద్రా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement