లొంగిపోయిన ప్రొఫెసర్ సాయిబాబా
నాగ్‌పూర్: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం రాత్రి జైలుకు వచ్చి సరెండర్ అయినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. కోర్టు ఆయనకిచ్చిన బెయిల్ గడువు ఈనెల 31 వరకు ఉంది. అయితే ఆరోగ్యకారణాల రీత్యా బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
48 గంటల్లోపు లొంగిపోవాలని ఆదేశించింది. రెండు రోజుల్లోగా సరెండర్ కాకపోతే సాయిబాబాను అరెస్ట్ చేయాలని జస్టిస్ అరుణ్ చౌదరీ పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా జైలు అధికారుల వద్దకు వచ్చి లొంగిపోయారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్య నివేదికను సమర్పించాలని జడ్జి ఆదేశించారు.