న్యూఢిల్లీ : ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విశ్వవిద్యాలయమైనా రాజ్యాంగంలోని 14వ అధికరణను గౌరవించాల్సిందే! కుల, మత, లింగ వివక్షతలకు దూరంగా ఉండాల్సిందే. వారణాసిలోని ‘బనారస్ హిందు యూనివర్శిటీ’ ఇందుకు అతీతం ఏమీ కాదు. ఈ యూనివర్శిటీలో సంస్కృతం చెప్పే ముస్లిం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా గత పది రోజులుగా విద్యార్థులు అనవసరంగా ఆందోళన చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం ఈ ఏడాది మొదట్లోనే సంస్కృత అధ్యాపకుడిగా బనారస్ యూనివర్శిటీలో చేరారు. తెలుగు వారికన్నా మంచిగా సంస్కృతం చెబుతున్నారన్న మంచి పేరు కూడా ఆయనకు వచ్చింది. పైగా ఆయన రాజస్థాన్ ప్రభుత్వం నుంచి ‘సంస్కృత్ యువ ప్రతిభా సమ్మాన్’ను కూడా అందుకున్నారు. విద్యార్హతలుండి అర్హులైన 11 మందిని ఇంటర్వ్యూచేసి బనారస్ విశ్వవిద్యాలయం అధికారులు ఫిరోజ్ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఆయన ముస్లిం అవడం వల్లనే వారు ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఎవరు ఇటీవల విద్యార్థులను రెచ్చగొట్టారో తెలియదుగానీ, ఓ ముస్లిం వ్యక్తి తమకు సంస్కృతం బోధించడం ఏమిటని, అందులోనూ హిందూ పురాణాల గురించి చెప్పడం ఏమిటంటూ ఆందోళనకు దిగారు. ఫిరోజ్ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించే వరకు తాము తరగతులకు రామంటూ భీష్మించుకొని బహిష్కరణకు దిగారు. ఫిరోజ్ ఖాన్‌కు అండగా నిలబడిన బనారస్ యూనివర్శిటీ అధికారులు, విద్యార్థులకు శతవిధాల నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. యూనివర్శిటీ అధికారులు లంచం పుచ్చుకొని అనర్హుడైన ఫిరోజ్ ఖాన్‌కు ఉద్యోగం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
భారత రాజ్యాంగంలో 14వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలను నిషేధించిన విషయం గురించి సదరు విద్యార్థులకు తెలియదా? తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌ను ఎన్నుకుని, ఇష్టమైన ఉద్యోగం చేయడం ఫిరోజ్ ఖాన్ ప్రాథమిక హక్కనే విషయం కూడా తెలియదా? యూనివర్శిటీలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కేంద్రంలోని మానవ వనరుల శాఖా మాత్యులు పెదవి విప్పరెందుకు? జేఎన్‌యూ యూనివర్శిటీలో ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చేస్తుంటే నోరు విప్పని మంత్రులు మతం పేరుతో జరుగుతున్న రాద్దాంతంలో నోరు విప్పుతారనుకోవడం అతిశయోక్తే కావచ్చు!
బనారస్ హిందు యూనివర్శిటీ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఉంది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే మోదీ జాతి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలని, పరస్పరం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తి ఆయన మంత్రులకు కొరవడిందా? మోదీ పిలుపు బనారస్ విద్యార్థులకు చేరలేదా?!
Comments
Please login to add a commentAdd a comment