పీఎస్‌ఎల్వీ–సీ39 ప్రయోగం విఫలం | PSLV-Sea 39 experiment fail | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్వీ–సీ39 ప్రయోగం విఫలం

Published Fri, Sep 1 2017 1:15 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

పీఎస్‌ఎల్వీ–సీ39 ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్వీ–సీ39 ప్రయోగం విఫలం

సాంకేతిక లోపమే కారణమన్న ఇస్రో చైర్మన్‌
పీఎస్‌ఎల్వీ చరిత్రలోనే రెండో వైఫల్యమిది  


శ్రీహరికోట (సుళ్లూరుపేట): తొలిసారిగా ప్రైవేటు సంస్థల క్రియాశీల భాగస్వామ్యంతో గురువారం నింగికెగసిన పీఎస్‌ఎల్వీ–సీ39 రాకెట్‌ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. భారత్‌కు సొంత దిక్సూచి వ్యవస్థను సమకూర్చడంలో భాగంగా ఇస్రో గెలుపు గర్రం పీఎస్‌ఎల్వీ రాకెట్‌ మోసుకెళ్లిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌ ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరలేకపోయింది.

రాత్రి 7 గంటలకు రాకెట్‌ ఆకాశంలోకి దూసుకెళ్లగా 20 నిమిషాల అనంతరం ప్రయోగం విఫలమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది. ఉష్ణకవచం (హీట్‌ షీల్డ్‌) రాకెట్‌ నుంచి వేరుపడకపోవడంతో దానిలో ఉన్న ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లలేదనీ, నాలుగో దశలోనే ఇరుక్కుపోయిందని (ఇస్రో) చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. సమగ్రంగా విశ్లేషించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామనీ, ఉష్ణకవచం వేరుపడక పోవడం మినహా ప్రయోగం సమస్తం సవ్యంగానే సాగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రయోగం విఫలమవడంతో కిరణ్‌తోపాటు శాస్త్రవేత్తలంతా ఒకింత బాధగా కనిపించారు.

మూడో దశ నుంచి సమస్య మొదలు...
మూడోదశ నుంచి రాకెట్‌ ప్రయోగంలో తేడా వచ్చింది. మూడోదశ 606 సెకండ్లకు విడిపోయి రాకెట్‌ శిఖరభాగాన అమర్చిన ఉష్ణకవచం విచ్చుకోవాల్సి వుండగా 520 సెకెండ్లకే విడిపోయింది. ఉష్ణకవచం తెరచుకోలేదు. అలాగే నాలుగో దశ 1128 సెకెండ్లకు విడిపోవాల్సి వుండగా 1039 సెకండ్లకే విడిపోయినట్టుగా రాకెట్‌ గమన పట్టికలో చూపించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌ ఉపగ్రహం అనుకున్న ప్రకారం కక్ష్యలోకి చేరి ఉంటే భారత్‌కు జీపీఎస్‌ లాంటి సొంత దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఉండేది.

అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడటంతోపాటు మరెన్నో అవసరాలను తీర్చి ఉండేది. దిక్సూచి వ్యవస్థకు ఏడు ఉపగ్రహాలు అవసరమవగా, ఇప్పటికే ఏడింటినీ ఇస్రో కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. అయితే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఏ ఉపగ్రహంలోని మూడు రుబీడియం అణు గడియారాలు పనిచేయకపోవడంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1హెచ్‌ను పంపాల్సి వచ్చింది. కాగా, ఇంతకుముందు జరిగిన ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థల పాత్రను రాకెట్‌ పరికరాల సరఫరాకే పరిమితం చేయగా పీఎస్‌ఎల్వీ–సీ39లో మాత్రం పరికరాలను జతచేయడం, పరీక్షించడంలో కూడా ప్రైవేటును అనుమతించారు.

24 ఏళ్లలో తొలి వైఫల్యం....
పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌కు సంక్షిప్త రూపమైన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ప్రయోగం వైఫల్యం చెందడం గత 24 ఏళ్లలో ఇదే తొలిసారి. పీఎస్‌ఎల్వీ చరిత్రలోనే రెండోసారి. 1993 సెప్టెంబరు 20న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ–డీ1 అనే రాకెట్‌ ఐఆర్‌ఎస్‌–1ఈ ఉపగ్రహాన్ని నింగికి మోసుకెళ్లడంలో తొలిసారి విఫలమైంది. ఆ తర్వాత పీఎస్‌ఎల్వీతో ఇస్రో అనేక ప్రయోగాలు చేపడుతూ ఎన్నో అద్భుత విజయాలు, ఘనతలు సాధించింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1994 అక్టోబరు 15 నుంచి 2017 జూన్‌ 23 మధ్య సరిగ్గా 39 ప్రయోగాలను పీఎస్‌ఎల్వీతోనే ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఈ ఏడాది తొలినాళ్లలో 104 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన పీఎస్‌ఎల్వీ...ఇస్రోకి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తు ప్రయోగాలైన చంద్రయాన్‌–2, అంగారకుడిపై పరిశోధనలకూ పీఎస్‌ఎల్వీపైనే ఇస్రో ఆధారపడి ఉంది.

హీట్‌ షీల్డ్‌ విచ్చుకోనందునే..
 పీఎస్‌ఎల్‌వీ–సీ39 ప్రయోగం విఫలం కావడానికి రాకెట్‌ శిఖర భాగాన అమర్చిన ఉష్ణపు గది(హీట్‌ షీల్డ్‌) విచ్చుకోకపోవడమే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు తేల్చారు. ఇస్రో చరిత్రలో ఇలాంటి అవాంతరం తలెత్తడం ఇదే మొదటిసారి. సాధారణంగా ప్రయోగం పూర్తవగానే వెళ్లిపోయే ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ షార్‌లోనే ఉండి హీట్‌షీల్డ్‌ విచ్చుకోకపోవడానికి కారణాలపై సహచర శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్నారు. హీట్‌షీల్డ్‌ విచ్చుకోవడానికి 2 కమాండ్‌ సిగ్నల్స్‌ ఉంటాయి. వీటి నుంచి మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌కు సిగ్నల్స్‌ అందకపోవడం వల్ల హీట్‌షీల్డ్‌ విచ్చుకో లేదని గుర్తించినట్టు సమాచారం.

రెండు కమాండ్‌ సిగ్నల్స్‌లో ఒకటి కాకపోయినా మరొకటి పని చేసివుంటే ప్రయోగం విఫలమయ్యేది కాదు. కమాండ్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడానికి కారణాలేంటి? సాంకేతిక లోపం ఏమిటనే దానిపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్‌ సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారు. ఈ సాంకేతిక లోపం ఎందుకు తలెత్తిందనే దానిపై విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శివన్‌ ఆధ్వర్యంలో కమిటీ వేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని చైర్మన్‌ ఆదేశించినట్టు తెలు స్తోంది. నివేదిక వచ్చాక వైఫల్యానికి కారణం మానవ తప్పిదమా? సాంకేతిక లోపమా? అనేది తేలుతుంది.

Advertisement
Advertisement