స్కూటర్‌పై వీధుల్లో పర్యటిస్తున్న పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి (మధ్యలో)
సాక్షి, కేకే.నగర్ (చెన్నై): పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం లేదని ఫిర్యాదు రావడంతో సీఎం వి. నారాయణస్వామి బుధవారం రాత్రి వీధుల్లో స్కూటర్‌పై తిరిగి పరిశీలించారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు పుదుచ్చేరి ఎల్లయమ్మన్ కోవిల్ వీధిలోని తన ఇంటి నుంచి సీఎం స్కూటర్‌పై బయల్దేరారు. ఆయనతో పాటు మరో స్కూటర్‌లో మంత్రి కమలకన్నన్ వెళ్లారు.
మిషన్ వీధి, పుస్కి వీధి, ఆంబూర్ రోడ్డు, అరవిందర్ వీధి, అన్నాసాలై, ఎస్పీ పటేల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో వీధిలైట్లు పనిచేస్తున్నాయా.. లేదా అని రాత్రి 11 గంటల వరకు ఆయన పరిశీలించారు. ఆ సమయంలో పలు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగకుండా ఉండడం చూసిన సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వాటిని సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి స్కూటర్‌పై రావడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆయనతో పాటు స్కూటర్లపై తిరిగిన వారెవరూ హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. వీధిలైట్లు, మహిళల భద్రత గురించి తెలుసుకునేందుకు మంత్రి కమలకన్నన్, అధికారులతో కలిసి 25 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణించినట్టు సీఎం నారాయణస్వామి ట్విటర్‌లో పేర్కొన్నారు. తాను స్కూటర్‌పై వెళుతున్న ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా గత నెల 18న స్కూటర్‌పై పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.