Puducherry CM
-
చేజారిన పుదుచ్చేరి
చిన్నదే కావొచ్చుగానీ... దక్షిణాదిన కాంగ్రెస్‌కున్న ఏకైక స్థావరం చేజారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమ ప్రభుత్వ బలం క్షీణించిందని గ్రహించిన ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి సోమవారం విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగటానికి ముందే రాజీనామా చేశారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడనాడటాన్ని గమనించి ఆయన ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని చాలామంది అంచనా వేశారు. పదవీకాలం మరో నెలలో ముగియాల్సివున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కప్పదాట్లకు సిద్ధపడటం విచిత్రమనిపిస్తుంది. ఇందులో తమ బాధ్యతేమీ లేదని అందరూ అనుకోవటం కోసమే కేంద్ర ప్రభుత్వం తొలుత కిరణ్ బేడీని అర్థంతరంగా పంపించివుండొచ్చని విశ్లేషకులు చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో అధికార కూటమి బీటలు వారే అవకాశమున్నదని తెలిస్తే కేంద్రంలోని పాలక కూటమి నిర్లిప్తంగా వుండే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ దుష్ట సంప్రదాయానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీయే. సుప్రీంకోర్టు బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పు ఆ ధోరణిని ఎంతో కొంత నియంత్రించగలిగింది. కానీ దాన్ని పూర్తిగా మాయం చేయలేకపోయింది. న్యాయస్థానాలు దృఢంగా నిలబడి ఈ మాదిరి చర్యలను అడ్డుకుని ప్రభుత్వాలను పునరుద్ధరించిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఆ వెసులుబాటును ఉపయోగించుకోగలిగిన స్థితిలో కూడా పాలకపక్షాలుండాలి. రాజస్తానే అందుకు ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు ముంచుకురాగా... ఆ పార్టీ దాన్ని నివారించటంలో సఫలీకృతమైంది. కానీ ఆ పార్టీయే అంతక్రితం మధ్యప్రదేశ్‌లో విఫలమైంది. అక్కడ బీజేపీ జయప్రదంగా అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. స్వల్ప మెజారిటీతో అధికార పక్షాలు నెట్టుకొస్తున్న రాష్ట్రాల్లోనూ... తక్కువమంది శాసనసభ్యులుండే చిన్న రాష్ట్రాల్లోనూ ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించటం ఎప్పుడైనా సులభమవుతుంది. పాలకపక్షానికి చెందిన అధినాయకత్వం సంస్థాగత అంశాలను నిర్లక్ష్యం చేస్తే, శాసనసభ్యుల్లో వున్న అసంతృప్తిని సకాలంలో గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోనట్టయితే సహజంగానే ప్రత్యర్థి పార్టీలకు అది వరంగా మారుతుంది. ఈమధ్యే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి సందర్శించారు. కానీ అప్పటికే అంతా తారుమారైంది. ఆయన వచ్చే ముందు కొందరూ, వచ్చి వెళ్లాక మరికొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా కిరణ్ బేడీ తీసుకుంటున్న చర్యలు నారాయణస్వామి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూనే వున్నాయి. ఎప్పటికప్పుడు కిరణ్ బేడీ తీరును ఆయన గట్టిగా వ్యతిరేకించటం, ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చిందనుకునేలోగా మళ్లీ కొత్త సమస్య నెత్తిన పడటం రివాజుగా మారింది. అదే సమయంలో ఆయన కూడా నిరంకుశంగానే ప్రవర్తించారు. నిరుడు జూలైలో సీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి వెళ్లగొట్టడంతోపాటు ఆయన శాసనసభ్యత్వం సైతం రద్దయ్యేలా చేశారు. పార్టీ అధినాయకత్వం అందరితో మాట్లాడి చక్కదిద్దటం, కిరణ్ బేడీ తీరుపై ఆయన చేస్తున్న పోరాటానికి నైతిక మద్దతు కూడగట్టటం వంటివి సరిగా చేయలేకపోయింది. పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరుండాలనే అంశం చుట్టూనే ఇటీవల కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇదంతా ప్రత్యర్థి పక్షానికి ఉపయోగపడింది. అటు ఇందులో తమ అపరాధం కాస్తయినా లేదని చెప్పటానికి ఎన్డీఏ పెద్దలు పడిన తాపత్రయం బాహాటంగా కనబడుతూనే వుంది. అందుకోసం కొన్ని నెలల్లో పదవీకాలం పూర్తవుతున్న కిరణ్ బేడీ హఠాత్తుగా నిష్క్రమించాల్సివచ్చింది. రాష్ట్రంలో ఆమె చర్యలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టదాయకం కావొచ్చునని బీజేపీ కూడా భావించే స్థితి ఏర్పడటం గమనించాల్సిన అంశం. తాము నియమించిన గవర్నరే అయినా రాజీనామా కూడా కోరకుండా తొలగించిన సందర్భాలు దాదాపు లేవు. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వున్న జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా విషయంలో మాత్రమే అలా జరిగింది. ఆయనపై చర్య తీసుకున్నది కూడా నరేంద్ర మోదీ సర్కారే. అంతకుముందు పాత పాలకపక్షం నియమించిన గవర్నర్లను మాత్రమే తొలగించిన ఉదంతాలుండేవి. గవర్నర్లు సక్రమంగా తమ విధులను నిర్వర్తించకపోతే సంక్షోభాలు తలెత్తుతాయి. వారిని అర్థంతరంగా తొలగించినా అదే జరుగుతుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ప్రభుత్వాన్ని పడగొట్టిందని నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు గనుక ప్రజలను ఆ విషయంలో ఒప్పించగలిగితే మళ్లీ ఆయన పార్టీకి అధికారం దక్కే అవకాశం వుండొచ్చు. కానీ ఈ మాదిరి సమస్యలే పునరావృతమైతే? పుదుచ్చేరి సంక్షోభానికి బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం విమర్శించటంలో తప్పేమీ లేదు. కానీ తనవైపుగా సరిదిద్దుకోవాల్సిన అంశాలేమిటో గుర్తించటం కూడా ముఖ్యమని ఆ పార్టీ గ్రహించకపోతే దాన్నెవరూ కాపాడలేరు. అలాగే గతంలో గవర్నర్లను ఇష్టానుసారం తొలగించటం తప్పిదమేనని, ఈ సంప్రదాయం నెలకొల్పినందుకు క్షమాపణ కోరుతున్నామని ప్రకటించి, భవిష్యత్తులో అలా జరగబోదని హామీ ఇవ్వగలగాలి. గవర్నర్ల విషయంలోనైనా, మరే అంశంలోనైనా రాజ్యాంగ విహితంగా నడుచుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే జనం మెచ్చరని బీజేపీ కూడా తెలుసుకోవాలి. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
పుదుచ్చేరి సీఎంకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్ బేడీకి అధికారాల విషయంలో తలెత్తిన వివాదంలో సుప్రీంకోర్టు సీఎంకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈనెల 7న కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే ఎలాంటి ఆర్థికపరమైన నిర్ణయాలను జూన్ 21వరకు అమలు చేయరాదని ఆదేశించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుతో పుదుచ్చేరిలో పాలన స్తంభించిపోయిందని, ఏప్రిల్ 30కి ముందున్న పరిస్థితులను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో కేంద్రంతో పాటు కిరణ్ బేడీ పిటిషన్ దాఖలు చేశారు. -
వైరల్ వీడియో: డ్రైనేజీ శుభ్రం చేసిన సీఎం
పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్‌లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు. కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్ చేశారు. -
మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం
-
రాత్రిపూట స్కూటర్‌పై సీఎం చక్కర్లు
సాక్షి, కేకే.నగర్ (చెన్నై): పుదుచ్చేరి శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం లేదని ఫిర్యాదు రావడంతో సీఎం వి. నారాయణస్వామి బుధవారం రాత్రి వీధుల్లో స్కూటర్‌పై తిరిగి పరిశీలించారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు పుదుచ్చేరి ఎల్లయమ్మన్ కోవిల్ వీధిలోని తన ఇంటి నుంచి సీఎం స్కూటర్‌పై బయల్దేరారు. ఆయనతో పాటు మరో స్కూటర్లో మంత్రి కమలకన్నన్ వెళ్లారు. మిషన్ వీధి, పుస్కి వీధి, ఆంబూర్ రోడ్డు, అరవిందర్ వీధి, అన్నాసాలై, ఎస్పీ పటేల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో వీధిలైట్లు పనిచేస్తున్నాయా.. లేదా అని రాత్రి 11 గంటల వరకు ఆయన పరిశీలించారు. ఆ సమయంలో పలు ప్రాంతాల్లో వీధి లైట్లు వెలగకుండా ఉండడం చూసిన సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వాటిని సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి స్కూటర్‌పై రావడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. ఆయనతో పాటు స్కూటర్లపై తిరిగిన వారెవరూ హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. వీధిలైట్లు, మహిళల భద్రత గురించి తెలుసుకునేందుకు మంత్రి కమలకన్నన్, అధికారులతో కలిసి 25 కిలోమీటర్లు స్కూటర్‌పై ప్రయాణించినట్టు సీఎం నారాయణస్వామి ట్విటర్లో పేర్కొన్నారు. తాను స్కూటర్‌పై వెళుతున్న ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కూడా గత నెల 18న స్కూటర్‌పై పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి
పుదుచ్చేరి: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణస్వామి పుదుచ్చేరి పదో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇక్కడి గాంధీ థిడాల్లో నారాయణ, మరో ఐదుగురు మంత్రుల చేత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రమాణం చేయించారు. వీరిలో సీఎం పీఠం కోసం పోటీపడిన నమశ్శివాయమ్, మల్లాది కృష్ణారావు, ఎంఓహెచ్ఎఫ్ షాజహాన్, ఎం.కందసామి, కమలాకన్నన్ ఉన్నారు. యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. వీరంతా గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారే. 30 మంది సభ్యుల అసెంబ్లీలో 15 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా 69 ఏళ్ల నారాయణ గత నెలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
నారాయణస్వామి ప్రమాణ స్వీకారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా కాం గ్రెస్ సీనియర్ నేత నారాయణస్వామి సోమవారం పదవీ ప్రమాణం చేశారు. గవర్నర్ కిరణ్‌బేడీ ఆయనతో ప్రమా ణం చేయించారు. నారాయణస్వామితోపాటూ ఐదుగురు మంత్రులు ప్రమాణం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెల 16వ తేదీన జరిగిన ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్-డీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ సమావేశంలో నారాయణస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎ న్నుకున్నారు. తన ఎన్నిక వివరాలతో కూడిన పత్రాన్ని ఆయన గవర్నర్‌కు అందజే సి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం ఈ సందర్భంగా పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది. బీచ్‌రోడ్డులోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశం ప్రాంగణంలోకి వచ్చిన నారాయణస్వామికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ బరిదా స్వాగతం చె ప్పారు. పుదువై 19వ ముఖ్యమంత్రిగా నారాయణస్వామితో గవర్నర్ కిరణ్‌బేడీ పదవీ ప్రమాణం చేయించారు. భగవంతుని సాక్షిగా అంటూ నారాయణస్వామి ప్రమాణం చేశారు. ఆయనతోపాటూ మంత్రులుగా నమశివాయం, కందస్వామి, మల్లాడి కృష్ణారావు, షాజహాన్, కమల్‌కన్నన్ ప్రమాణం చేశారు. 12.05కు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.25 గంటలకు ముగిసింది. డీఎంకే కోశాధికారి, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్, తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్‌వాస్నిక్ తదితరులు పాల్గొన్నారు. నారాయణుని వరాలు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో నారాయణస్వామి స్వామి మాట్లాడుతూ ప్రజలపై వరాలు జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా ఇంతవరకు 10 కిలోల ఉచిత బియ్యాన్ని 20 కిలోలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేగాక ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలలపాటూ నిలిపివేసిన 30 కిలోల బియ్యాన్ని కూడా సరఫరా చేస్తామని తెలిపారు. ఆగస్టు నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని అన్నారు. అలాగే విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తామని చెప్పారు. జాలర్లకు పలు రాయితీలను ప్రకటించారు.