చిన్నదే కావొచ్చుగానీ... దక్షిణాదిన కాంగ్రెస్‌కున్న ఏకైక స్థావరం చేజారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమ ప్రభుత్వ బలం క్షీణించిందని గ్రహించిన ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి సోమవారం విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగటానికి ముందే రాజీనామా చేశారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడనాడటాన్ని గమనించి ఆయన ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని చాలామంది అంచనా వేశారు. పదవీకాలం మరో నెలలో ముగియాల్సివున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కప్పదాట్లకు సిద్ధపడటం విచిత్రమనిపిస్తుంది. ఇందులో తమ బాధ్యతేమీ లేదని అందరూ అనుకోవటం కోసమే కేంద్ర ప్రభుత్వం తొలుత కిరణ్ బేడీని అర్థంతరంగా పంపించివుండొచ్చని విశ్లేషకులు చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు.
ఒక రాష్ట్రంలో అధికార కూటమి బీటలు వారే అవకాశమున్నదని తెలిస్తే కేంద్రంలోని పాలక కూటమి నిర్లిప్తంగా వుండే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ దుష్ట సంప్రదాయానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీయే. సుప్రీంకోర్టు బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పు ఆ ధోరణిని ఎంతో కొంత నియంత్రించగలిగింది. కానీ దాన్ని పూర్తిగా మాయం చేయలేకపోయింది. న్యాయస్థానాలు దృఢంగా నిలబడి ఈ మాదిరి చర్యలను అడ్డుకుని ప్రభుత్వాలను పునరుద్ధరించిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఆ వెసులుబాటును ఉపయోగించుకోగలిగిన స్థితిలో కూడా పాలకపక్షాలుండాలి. రాజస్తానే అందుకు ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు ముంచుకురాగా... ఆ పార్టీ దాన్ని నివారించటంలో సఫలీకృతమైంది. కానీ ఆ పార్టీయే అంతక్రితం మధ్యప్రదేశ్‌లో విఫలమైంది.
అక్కడ బీజేపీ జయప్రదంగా అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. స్వల్ప మెజారిటీతో అధికార పక్షాలు నెట్టుకొస్తున్న రాష్ట్రాల్లోనూ... తక్కువమంది శాసనసభ్యులుండే చిన్న రాష్ట్రాల్లోనూ ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించటం ఎప్పుడైనా సులభమవుతుంది. పాలకపక్షానికి చెందిన అధినాయకత్వం సంస్థాగత అంశాలను నిర్లక్ష్యం చేస్తే, శాసనసభ్యుల్లో వున్న అసంతృప్తిని సకాలంలో గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోనట్టయితే సహజంగానే ప్రత్యర్థి పార్టీలకు అది వరంగా మారుతుంది. ఈమధ్యే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి సందర్శించారు. కానీ అప్పటికే అంతా తారుమారైంది. ఆయన వచ్చే ముందు కొందరూ, వచ్చి వెళ్లాక మరికొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
గత నాలుగున్నరేళ్లుగా కిరణ్ బేడీ తీసుకుంటున్న చర్యలు నారాయణస్వామి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూనే వున్నాయి. ఎప్పటికప్పుడు కిరణ్ బేడీ తీరును ఆయన గట్టిగా వ్యతిరేకించటం, ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చిందనుకునేలోగా మళ్లీ కొత్త సమస్య నెత్తిన పడటం రివాజుగా మారింది. అదే సమయంలో ఆయన కూడా నిరంకుశంగానే ప్రవర్తించారు. నిరుడు జూలైలో సీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి వెళ్లగొట్టడంతోపాటు ఆయన శాసనసభ్యత్వం సైతం రద్దయ్యేలా చేశారు. పార్టీ అధినాయకత్వం అందరితో మాట్లాడి చక్కదిద్దటం, కిరణ్ బేడీ తీరుపై ఆయన చేస్తున్న పోరాటానికి నైతిక మద్దతు కూడగట్టటం వంటివి సరిగా చేయలేకపోయింది. పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరుండాలనే అంశం చుట్టూనే ఇటీవల కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయి.
ఇదంతా ప్రత్యర్థి పక్షానికి ఉపయోగపడింది. అటు ఇందులో తమ అపరాధం కాస్తయినా లేదని చెప్పటానికి ఎన్‌డీఏ పెద్దలు పడిన తాపత్రయం బాహాటంగా కనబడుతూనే వుంది. అందుకోసం కొన్ని నెలల్లో పదవీకాలం పూర్తవుతున్న కిరణ్ బేడీ హఠాత్తుగా నిష్క్రమించాల్సివచ్చింది. రాష్ట్రంలో ఆమె చర్యలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టదాయకం కావొచ్చునని బీజేపీ కూడా భావించే స్థితి ఏర్పడటం గమనించాల్సిన అంశం. తాము నియమించిన గవర్నరే అయినా రాజీనామా కూడా కోరకుండా తొలగించిన సందర్భాలు దాదాపు లేవు. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వున్న జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా విషయంలో మాత్రమే అలా జరిగింది. ఆయనపై చర్య తీసుకున్నది కూడా నరేంద్ర మోదీ సర్కారే. అంతకుముందు పాత పాలకపక్షం నియమించిన గవర్నర్లను మాత్రమే తొలగించిన ఉదంతాలుండేవి. గవర్నర్లు సక్రమంగా తమ విధులను నిర్వర్తించకపోతే సంక్షోభాలు తలెత్తుతాయి. వారిని అర్థంతరంగా తొలగించినా అదే జరుగుతుంది.
తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ప్రభుత్వాన్ని పడగొట్టిందని నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు గనుక ప్రజలను ఆ విషయంలో ఒప్పించగలిగితే మళ్లీ ఆయన పార్టీకి అధికారం దక్కే అవకాశం వుండొచ్చు. కానీ ఈ మాదిరి సమస్యలే పునరావృతమైతే? పుదుచ్చేరి సంక్షోభానికి బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం విమర్శించటంలో తప్పేమీ లేదు. కానీ తనవైపుగా సరిదిద్దుకోవాల్సిన అంశాలేమిటో గుర్తించటం కూడా ముఖ్యమని ఆ పార్టీ గ్రహించకపోతే దాన్నెవరూ కాపాడలేరు. అలాగే గతంలో గవర్నర్లను ఇష్టానుసారం తొలగించటం తప్పిదమేనని, ఈ సంప్రదాయం నెలకొల్పినందుకు క్షమాపణ కోరుతున్నామని ప్రకటించి, భవిష్యత్తులో అలా జరగబోదని హామీ ఇవ్వగలగాలి. గవర్నర్ల విషయంలోనైనా, మరే అంశంలోనైనా రాజ్యాంగ విహితంగా నడుచుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే జనం మెచ్చరని బీజేపీ కూడా తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment